
ఈ ఏడాది (2025) రంజీ ఛాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టు (Vidarbha), ఇరానీ కప్‌ను (Irani Cup 2025) కూడా కైవసం చేసుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాపై (Rest Of India) 93 పరుగుల తేడాతో గెలుపొంది, డబుల్ ధమాకా సాధించింది. విదర్భ రంజీ ట్రోఫీని, ఇరానీ కప్‌ను ఒకే ఏడాది గెలవడం ఇది మొదటిసారి కాదు. 2018, 2019 సీజన్లలోనూ రెండు ట్రోఫీలను సాధించింది.
ఇటీవలికాలంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో చెలరేగిపోతున్న ఈ తూర్పు మహారాష్ట్ర జట్టు.. హేమాహేమీలున్న జట్లను సైతం మట్టికరిపిస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. ఆ జట్టు విజయాల్లో అథర్వ తైడే, ధృవ్ షోరే, డానిష్ మాలేవార్, యశ్ రాథోడ్, అక్షయ్ వాద్కర్, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే, ఆదిత్య సర్వటే, దర్శన్ నల్కండే, పార్థ్ రేఖడే లాంటి ఆటగాళ్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.
తాజాగా ఇరానీ కప్ చేజిక్కించుకోవడంలో అథర్వ తైడే ప్రధానపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ (143) చేసి విదర్భ భారీ స్కోర్ చేయడానికి పునాది వేశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో యశ్ రాథోడ్ (91) కూడా సత్తా చాటడు.
తొలి ఇన్నింగ్స్‌లో తైడేతో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. బౌలింగ్‌లో యశ్ ఠాకూర్ (16.5-3-66-4, 7-1-47-2) , హర్ష్ దూబే (22-5-58-2, 27.5-5-73-4)అదరగొట్టారు.
ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. జట్టులో టీమిండియాకు ఆడిన ఆకాశ్‌దీప్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లు ఉన్నా తేలిపోయారు.
తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్ (66), అభిమన్యు ఈశ్వరన్ (52).. రెండో ఇన్నింగ్స్‌లో యశ్ ధుల్ (92), సుతార్ (56 నాటౌట్) పర్వాలేదనిపించారు. బౌలింగ్‌లో ఆకాశ్‌దీప్, అన్షుల్, మానవ్ సుతార్, సరాన్ష్ రాణించినా, తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్ చేయడంతో విదర్భ మ్యాచ్‌పై పట్టు సాధించింది.
స్కోర్ల వివరాలు..
విదర్భ- 342 & 232
రెస్ట్ ఆఫ్ ఇండియా- 214 & 267
93 పరుగుల తేడాతో విదర్భ విజయం
చదవండి: భారత్ నా మాతృభూమి, దేవాలయం లాంటిది: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు