
పాకిస్తాన్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. త్వరలోనే కొత్త షెడ్యూల్, వేదికలను ఖారారు చేస్తామని భారత క్రికెట్ బోర్డు తెలిపింది.
దీంతో మే 9(శుక్రవారం) నుంచి మ్యాచ్‌లు ఆగిపోనున్నాయి. ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడంతో ఆయా ఫ్రాంచైజీలు అభిమానులకు టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేయడం ప్రారంభించాయి. షెడ్యూల్ ప్రకారం..ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడాల్సింది.
కానీ వాయిదా పడడంతో టిక్కెట్ల డబ్బులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేస్తామని వెల్లడించింది. కాగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అర్ధాంతంగా రద్దు అయ్యింది. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లో యూఏఈలో నిర్వహించే అవకాశముంది.