
సాక్షి, న్యూఢిల్లీ: క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, శిక్షకులు, సంస్థలను గౌరవించేందుకు ఉద్దేశించిన జాతీయ క్రీడా పురస్కారాలు–2025 కోసం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏటా ఇచ్చే ఈ అవార్డుల కోసం అర్హులైన వారు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరింది.
దరఖాస్తుల సమర్పణకు తుది గడువు అక్టోబర్ 28వ తేదీ. క్రీడారంగంలో వివిధ విభాగాల్లో విశేష సేవలందించిన వారికి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు, అర్జున అవార్డు, అర్జున అవార్డు (జీవితకాల సాఫల్యం), ద్రోణాచార్య అవార్డు, రాష్రీ్టయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ (ఆర్‌కేపీపీ) పురస్కారాలను అందజేస్తారు. క్రీడాకారులు, కోచ్‌లు, సంస్థలు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ప్రత్యేక పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అవార్డుల మార్గదర్శకాలు, ఇతర వివరాల కోసం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ www.dbtyas-sports.gov.in ను చూడాలని కోరింది.