తన గురించి జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అవన్నీ కేవలం కల్పితాలేనని.. అసత్య వార్తలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. టీమిండియా గొప్ప విజయాలు సాధించాలని.. జట్టుకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశాడు.
ఏకంగా జట్టు నుంచే తప్పించారు
కాగా ఈ ఏడాది భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్‌పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచినా.. ఆటగాడిగా విఫలమయ్యాడనే కారణంతో అతడిని ఏకంగా జట్టు నుంచే తప్పించారు సెలక్టర్లు.
సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. అయితే, శ్రేయస్ సారథ్యంలో.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో టీమిండియాకు ఇటీవల ఘెర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా ఊహించని విధంగా 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.
అనంతరం ఇంగ్లండ్ పర్యటనను కూడా ఓటమితోనే మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై విమర్శలు వస్తున్నాయి. సూర్యను తప్పించి పొరపాటు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ సైతం ఇలాగే స్పందించాడనే వార్త వైరల్ అయింది.
గౌరవం దక్కలేదన్నాడు!
తనను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో స్పష్టంగా తెలియదని.. సమాచారం కూడా ఇవ్వలేదని.. అసలు తనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని సూర్య అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ విషయంపై సూర్య తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
సూర్యకుమార్ పోస్ట్ వైరల్
‘‘భారత జట్టు కూర్పు పట్ల నేను సంతోషంగా ఉన్నాను. టీమిండియాకు మంచి జరగాలనే ఎల్లప్పుడూ కోరుకుంటాను. కుర్రాళ్లు ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. వారికి నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.
ముఖ్యంగా వైభవ్.. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది ఇంకాస్త ఆసక్తిగా సాగాలని నేను కోరుకుంటున్నా. ఆడుతున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదించు. దేశాన్ని గర్వపడేలా చేయాలి. ఇక సోషల్ మీడియాలో నేను అన్నట్లుగా ఓ వార్త ప్రచారం కావడం నా దృష్టికి వచ్చింది.
అవన్నీ తప్పుడు కథనాలు. నకిలీ వార్తలను నాకు ఆపాదిస్తున్నారు. నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇలాంటి అసత్య ప్రచారాలను దయచేసి నమ్మవద్దు.
భారత క్రికెట్, నా సహచర ఆటగాళ్లకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఇలాంటి నకిలీ వార్తల కంటే ఆట గురించిన చర్చే ఎక్కువగా ఉంటుంది. ఉండాలి కూడా’’ అని సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
చదవండి: మూడో టీ20కి ముందు వైభవ్‌కు గాయం!


