ఇంతింతై... వటుడింతై! బుమ్రా తర్వాత ఇప్పుడు అతడే.. అమ్ముల పొదిలో అరుదైన ‘వాబుల్‌ సీమ్‌’!

Special story on siraj about his performance  - Sakshi

Asia Cup 2023 Winner Team India- Mohammed Siraj: శ్రీలంక ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌.... సిరాజ్‌ వేసిన ఐదో బంతిని ధనంజయ మిడాన్‌ వైపు ఆడాడు. జోరు మీదున్న సిరాజ్‌ బంతిని ఆపేందుకు తానే స్వయంగా బౌండరీ వరకు పరుగెత్తాడు. అప్పటికే ఆ ఓవర్లో మూడు వికెట్లు తీసిన సిరాజ్‌కు అంత అవసరం లేదు. కోహ్లికి కూడా అలాగే అనిపించి గిల్‌తో పాటు అతనూ చిరునవ్వులు చిందించాడు. కానీ సిరాజ్‌ అంకితభావం ఎలాంటిదో అది చూపించింది.

ఒక్కసారిగా మైదానంలోకి దిగితే చాలు వంద శాతం అతను జోష్‌లో కనిపిస్తాడు. ఒక్క క్షణం కూడా ఉదాసీనత కనిపించదు. సిరాజ్‌ వన్డేల్లో ఇప్పుడు కీలక బౌలర్‌గా ఎదగడమే అనూహ్యం. టెస్టుల్లో తనను తాను నిరూపించుకొని రెగ్యులర్‌గా మారినా ఎంతో మంది పేసర్లు అందుబాటులో ఉన్న వన్డేల్లో అతనికి సులువుగా చోటు దక్కలేదు.

2019లో తొలి వన్డే ఆడి అతను జట్టులో స్థానం కోల్పోయాడు. టెస్టు ప్రదర్శనలు, ఐపీఎల్‌లో చక్కటి బౌలింగ్‌ కూడా అతనికి వన్డేల్లో చోటు కల్పించలేకపోయాయి. అయిదే దాదాపు ఏడాదిన్నర క్రితం సిరాజ్‌ కెరీర్‌లో కీలక మలుపు. వేర్వేరు సిరీస్‌లకు బుమ్రా, షమీలాంటి సీనియర్లు తరచుగా విశ్రాంతి తీసుకుంటుండటంతో అతనికి మళ్లీ అవకాశం దక్కింది.

దీనిని అతను అన్ని విధాలా అందిపుచ్చుకున్నాడు. మూడేళ్ల విరామం తర్వాత సిరాజ్‌ మళ్లీ వన్డే ఆడాడు. అంతే... అప్పటి నుంచి అతని ప్రదర్శన ప్రతీ మ్యాచ్‌కు మెరుగవుతూ వచ్చింది. ఏదో ద్వితీయ శ్రేణి జట్టులోకి ఎంపిక చేశాం... సీనియర్లు వస్తే మళ్లీ వెనక్కే అన్నట్లుగా కాకుండా తనను మరోసారి పక్కన పెట్టలేని విధంగా రాణించాడు.

ఫిబ్రవరి 2022 నుంచి ఆడిన 28 వన్డేల్లో 4 మ్యాచ్‌లు మినహా ప్రతీసారి వికెట్లు పడగొట్టాడు. అలాగనీ పరుగులు ధారాళంగా ఇవ్వలేదు. ఎకానమీ 5 పరుగులు కూడా దాటలేదు. వికెట్లు దక్కకపోయినా ఎన్నోసార్లు బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టి, మెయిడిన్లతో ఒత్తిడి పెంచి మ్యాచ్‌పై సిరాజ్‌ చూపించిన ప్రభావం అమూల్యం. ఇప్పుడు షమీని దాటి బుమ్రా తర్వాత రెండో ప్రధాన పేసర్‌గా మారాడు.

‘సిరాజ్‌ అరుదైన ప్రతిభావంతుడు’ అంటూ పదే పదే రోహిత్‌ ప్రశంసించడం టీమ్‌లో అతనేమిటో చూపించింది. సిరాజ్‌ పునరాగమనానికి ముందు ఏడాది కాలంలో కొత్త బంతితో భారత బౌలర్లు పేలవంగా బౌలింగ్‌ చేశారు. తొలి పది ఓవర్లలో అత్యంత చెత్త ప్రదర్శన (23 వన్డేల్లో 132.10 సగటు) నమోదు చేసిన టీమ్‌గా ఇండియా నిలిచింది. సిరాజ్‌ వచ్చాక అంతా మారిపోయింది.

ఆరంభ ఓవర్లలోనే వికెట్లు తీసి అతను ఇస్తున్న శుభారంభాలు జట్టు విజయానికి బాటలు వేశాయి. కెరీర్‌ ఆరంభంలో సహజమైన ఇన్‌స్వింగ్‌ బౌలర్‌గా అడుగు పెట్టిన అతను ఆ తర్వాత అవుట్‌స్వింగర్లు వేయడంలో రాటుదేలాడు. ఇప్పుడు అతని అమ్ముల పొదిలో అరుదైన ‘వాబుల్‌ సీమ్‌’ అనే ఆయుధం కూడా ఉంది. జనవరి 25న తొలిసారి ఐసీసీ వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచిన సిరాజ్‌ అప్పటి నుంచి చెలరేగుతూనే ఉన్నాడు.

29 వన్డేలు పెద్ద సంఖ్య కాకపోవచ్చు గానీ ఎలా చూసినా వన్డేల్లో 19.11 సగటు అసాధారణం. సరిగ్గా వరల్డ్‌ కప్‌కు ముందు సిరాజ్‌ సూపర్‌ ఫామ్‌ జట్టుకు ఆనందాన్నిచ్చే విషయం. ఇదే జోరు కొనసాగిస్తే ఈ హైదరాబాదీ పేసర్‌ మెగా టోర్నీలోనూ స్టార్‌గా నిలవడం ఖాయం.   –సాక్షి క్రీడా విభాగం  

4 వన్డేల్లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌ సిరాజ్‌. గతంలో చమిందా వాస్‌ (శ్రీలంక; 2003లో బంగ్లాదేశ్‌పై), మొహమ్మద్‌ సమీ (పాకిస్తాన్‌; 2003లో న్యూజిలాండ్‌పై), ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లండ్‌; 2019లో వెస్టిండీస్‌పై) ఈ ఫీట్‌ నమోదు చేశారు. 

6/21  వన్డేల్లో భారత్‌ తరఫున ఇది నాలుగో అత్యుత్తమ ప్రదర్శన. స్టువర్ట్‌ బిన్నీ (6/4), కుంబ్లే (6/12), బుమ్రా (6/19) సిరాజ్‌కంటే ముందున్నారు.  

263  మిగిలి ఉన్న బంతులపరంగా (43.5 ఓవర్లు) భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 

16  మ్యాచ్‌లో తొలి 5 వికెట్లు తీసేందుకు  సిరాజ్‌కు పట్టిన బంతులు. గతంలో  చమిందా వాస్, అలీఖాన్‌ (అమెరికా) కూడా ఇదే తరహాలో 16 బంతులు తీసుకున్నారు.  

129  రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఈ మ్యాచ్‌ 129 బంతుల్లోనే (21.3 ఓవర్లు)  ముగిసింది. తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌ల  జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది.

చదవండి: Ind Vs SL: అతడు అద్భుతం.. బ్యాటింగ్‌ సూపర్‌! కానీ.. క్రెడిట్‌ మొత్తం తనకే: రోహిత్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top