
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన భారీగా లబ్ది పొందింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో రికార్డు శతకం బాదిన మంధాన.. కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు (771) సాధించడమే కాకుండా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకింది. మంధానకు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ టీ20 ర్యాంకింగ్. ప్రస్తుతం మంధానకు టాప్ ర్యాంకర్ బెత్ మూనీకి (794) మధ్య కేవలం 23 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.
రెండో స్థానంలో ఉన్న హేలీ మాథ్యూస్‌కు (774) మంధానకు మధ్య కేవలం మూడు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇప్పటికే వన్డేల్లో టాప్ ర్యాంక్ బ్యాటర్‌గా కొనసాగుతున్న మంధాన.. తన ఫామ్‌ను ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్ మొత్తంలో కొనసాగిస్తే టీ20ల్లో కూడా నంబర్ వన్ స్థానానికి చేరుతుంది.
టాప్-10 టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మంధాన మినహా మరే ఇతర బ్యాటర్ లేరు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్, షఫాలీ వర్మ 12, 13 స్థానాల్లో ఉండగా.. జెమీమా రోడ్రిగెజ్ 15వ స్థానంలో ఉంది. రిచా ఘోష్ 25, దీప్తి శర్మ 31వ స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (43) ఆడిన హర్లీన్ డియోల్ టీ20 ర్యాంకింగ్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ర్యాంకింగ్స్‌లో ఆమె 86వ స్థానం దక్కింది.
కాగా, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జూన్ 28న నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మంధాన 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసింది. టీ20ల్లో మంధానకు ఇదే తొలి సెంచరీ.
ఈ సెంచరీతో ఆమె మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 14 సెంచరీలు చేసిన మంధాన టెస్ట్‌ల్లో 2, వన్డేల్లో 11, టీ20ల్లో ఓ సెంచరీ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మంధాన చేసిన స్కోర్ టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా (112) కూడా రికార్డైంది. గతంలో ఈ రికార్డు హర్మన్‌ప్రీత్ (103) పేరిట ఉండేది.
ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 ఇవాళ (జులై 1) జరుగనుంది. బ్రిస్టల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.