అతడికి ముందుగా ఏం చెప్పలేదు.. వరల్డ్‌కప్‌ ప్లాన్‌లో భాగమే! | Sitanshu Kotak Comments on Vaibhav Sooryavanshi debut Reveals WC plan | Sakshi
Sakshi News home page

అతడికి ముందుగా ఏం చెప్పలేదు.. వరల్డ్‌కప్‌ ప్లాన్‌లో భాగమే!

Jul 7 2026 6:28 PM | Updated on Jul 7 2026 6:53 PM

Sitanshu Kotak Comments on Vaibhav Sooryavanshi debut Reveals WC plan

విదేశీ పర్యటనలో టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. తొలుత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా ఓటమితో మొదలుపెట్టింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. మాంచెస్టర్‌ వేదికగా రెండో టీ20లో శ్రేయస్‌ సేన ఓటమి పాలైంది.

ఇక ఇరుజట్ల మధ్య మంగళవారం నాటింగ్‌హామ్‌ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ మీడియాతో మాట్లాడాడు. ‘‘మేము బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో బాగా మెరుగుపడాల్సి ఉంది.

వరల్డ్‌కప్‌ ప్లాన్‌లో భాగమే!
టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత.. మరో వరల్డ్‌కప్‌ గెలవడమే లక్ష్యంగా రెండేళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. మేము మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. ఇందుకోసం అన్ని విభాగాలూ కలిసి కట్టుగా కృషి చేస్తున్నాయి.

గత రెండేళ్లలో మేము ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోలేదు. అయితే, ఇప్పుడు మూడు మ్యాచ్‌లు ఓడిపోగానే అందరూ మా వైఫల్యాల గురించే మాట్లాడుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజం. జట్టులో మార్పులు జరుగుతున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం’’ అని సితాన్షు కొటక్‌ పేర్కొన్నాడు.

ముందుగా ఏం చెప్పలేదు
ఇక వైభవ్‌ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ఎంపికైన నాటి నుంచే అతడు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు. అంతేగానీ రెండో టీ20కి ముందే అతడిని సిద్ధంగా ఉండమని మాత్రం చెప్పలేదు.

అతడి ఆట ఎలా ఉంటుందో మాకు తెలుసు. అతడి ఆలోచనా విధానం, దూకుడు గురించి మాకు అవగాహన ఉంది. అయితే, ఇలా ఆడాలి.. అలా ఆడాలి అని మాత్రం అతడికి మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’’ అని సితాన్షు కొటక్‌ తెలిపాడు.

కాగా ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా వైభవ్‌ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. సంజూ శాంసన్‌ స్థానంలో అభిషేక్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగాడు. కానీ.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. వైభవ్‌ను ఆడించేందుకు సంజూను తప్పించడం అన్యాయం అంటూ యాజమాన్యంపై విమర్శలు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement