
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సింగపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పీవీ సింధు 21–14, 21–9 తేడాతో వెన్ యూ జాంగ్ (కెనడా)పై విజయం సాధించింది. 31 నిమిషాల్లో ముగిసిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన తెలుగమ్మాయి వరస గేమ్‌ల్లో గెలుపొందింది. బుధవారం జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఐదో ర్యాంకర్ చెన్ యూ ఫీ (చైనా)తో సింధు తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 21–16, 21–14తో రాస్‌మస్ గెమ్కే (డెన్మార్క్)పై గెలుపొందాడు. 72 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్‌లో ఓడిన అనంతరం తిరిగి పుంజుకున్న ప్రణయ్... ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరుస్తూ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తదుపరి రౌండ్‌లో ఫ్రాన్స్ షట్లర్ క్రిస్టోవ్ పొపోవ్‌తో ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. కాగా ఈ టోర్నీలో మిగిలిన భారత షట్లర్లకు నిరాశ ఎదురైంది.
మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్, అన్‌మోల్ పరాజయం పాలవగా... పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జ్‌కు నిరాశ తప్పలేదు. మాళవిక, ప్రియాన్షు తొలి గేమ్ గెలిచినప్పటికీ అదే జోరు కొనసాగించడంలో విఫలమై పరాజయాల పాలయ్యారు. మాళవిక 21–14, 18–21, 11–21తో ఎనిమిదో సీడ్ సుపనిడా కటెథాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో... ప్రియాన్షు 21–14, 10–21, 14–21తో ఏడో సీడ్ నరోకా (జపాన్) చేతిలో ఓడాడు.
అన్‌మోల్ 11–21, 22–24తో చెన్ చేతిలో... కిరణ్ జార్జ్ 19–21, 17–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో సంతోష్ రామ్‌రాజ్ 14–21, 8–21తో కిమ్ గా ఇన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, అషిత సూర్య–అమృత ప్రథమేశ్ జోడీలు నిరాశ పరచగా... మహిళల డబుల్స్‌లో కవిప్రియ సెల్వం–సిమ్రన్ సింగ్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.