'ఇదంతా అత‌డి వ‌ల్లే'.. గిల్‌ డబుల్‌ సెంచరీ వెనక మాస్టర్‌ మైండ్‌ | Shubman Gill reveals Gautam Gambhir advice after record-breaking 269 | Sakshi
Sakshi News home page

'ఇదంతా అత‌డి వ‌ల్లే'.. గిల్‌ డబుల్‌ సెంచరీ వెనక మాస్టర్‌ మైండ్‌

Jul 4 2025 11:56 AM | Updated on Jul 4 2025 12:53 PM

Shubman Gill reveals Gautam Gambhir advice after record-breaking 269

ఎడ్జ్‌బాస్టన్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు భార‌త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌కు తన కెరీర్‌లో చిర్మసరణీయంగా మిగిలిపోనుంది. ఈ మ్యాచ్‌లో గిల్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. గిల్‌కు టెస్టుల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.

అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 269 ప‌రుగులు చేశాడు. అయితే హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సలహాతోనే ఈ  మారథాన్ ఇన్నింగ్స్ ఆడినట్లు గిల్ వెల్లడించాడు.

"తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్‌కు వెళ్లేముందు నేను క్రీజులోకి వచ్చాను. ఆ తర్వాత  టీ సమయానికి నేను 100 బంతులు ఆడి 35 పరుగులు మాత్రమే చేశాను. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి గౌతమ్ గంభీర్ భాయ్‌తో మాట్లాడాను. నేను బౌండరీలు కొట్టలేకపోతున్నాని, ఫీల్డర్ల గ్యాప్ చూసుకుని ఆడుతున్నానని అతడితో చెప్పాను. 

అందుకు బదులుగా గౌతీ భాయ్‌ నన్ను క్రీజులో నిలదొక్కకోమని చెప్పాడు. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే పరుగులు వాటింతట అవే వస్తాయి అని అతడు అన్నాడు. ఇక ఐపీఎల్ ఆఖరిలో నా బ్యాటింగ్ టెక్నిక్‌పై తీవ్రంగా శ్రమించాను. నా ఫుట్ మూమెంట్‌, ఏ బంతులను ఆడాలో ఎంచుకోవడంపై ఎక్కువగా దృష్టిసారించాను.

ప్రతీ మ్యాచ్‌లోనూ నేను బాగానే బ్యాటింగ్ చేస్తున్నాను. కానీ 30-40 పరుగుల మధ్య ఔటయ్యేవాడిని. అందుకే ఈ సారి నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకున్నాను. అందుకు తగ్గట్టు నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేశాను. టీ20 ఫార్మాట్‌లో ఆడి ఒక్కసారిగా టెస్టుల్లోకి తిరిగి రావడం కష్టం​.

మన మైండ్‌సెట్‌ను మార్చుకోని ఆడాలి. వైట్‌బాల్ క్రికెట్ పూర్తి భిన్నం. అందుకే ఐపీఎల్-2025 నుంచే రెడ్‌బాల్ క్రికెట్‌తో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను" అని రెండో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో గిల్ పేర్కొన్నాడు.

ఇక భార‌త్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 587 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. భార‌త ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు య‌శ‌స్వి జైశ్వాల్‌( 87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల న‌ష్టానికి 77 ప‌రుగులు చేసింది.
చదవండి: ENG vs IND: ట్రిపుల్ సెంచ‌రీ మిస్‌.. ఇంగ్లండ్ ఆట‌గాడి ట్రాప్‌లో ప‌డ్డ గిల్‌! వీడియో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement