ట్రిపుల్ సెంచ‌రీ మిస్‌.. ఇంగ్లండ్ ఆట‌గాడి ట్రాప్‌లో ప‌డ్డ గిల్‌! వీడియో | Harry Brooks Mind Games Stopped Shubman Gill From Triple Century vs England, Check Out Full Details Inside | Sakshi
Sakshi News home page

ENG vs IND: ట్రిపుల్ సెంచ‌రీ మిస్‌.. ఇంగ్లండ్ ఆట‌గాడి ట్రాప్‌లో ప‌డ్డ గిల్‌! వీడియో

Jul 4 2025 11:04 AM | Updated on Jul 4 2025 12:12 PM

Harry Brooks Mind Games Stopped Shubman Gill From Triple Century vs England

ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ (Shubman Gill) అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 269 ప‌రుగులు చేశాడు. ఈ మారథాన్ ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ సాధించిన భార‌త కెప్టెన్‌గా విరాట్ కోహ్లి(254) రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.

ఓ ద‌శ‌లో గిల్‌ ట్రిపుల్ సెంచ‌రీ మార్క్‌ను కూడా అందుకునేలా క‌న్పించాడు. అయితే స‌మ‌యంలో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మైండ్ గేమ్స్ మొద‌లు పెట్టాడు. టీ విరామం త‌ర్వాత  265 ప‌రుగుల మార్కును దాటి బ్యాటింగ్ చేస్తున్న శుబ్‌మ‌న్ గిల్ ఏక‌గ్రాత‌ను దెబ్బ‌తీసేందుకు బ్రూక్ ప్ర‌య‌త్నించాడు.

స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్‌.. గిల్‌తో త‌న ట్రిపుల్ సెంచ‌రీ కోసం చ‌ర్చించాడు. 143 ఓవ‌ర్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గిల్‌-బ్రూక్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. అయితే ఇద్ద‌రి మాటలు అంత క్లారిటీగా బ‌య‌ట‌కు వినిపించ‌డం లేదు.

ఈ క్ర‌మంలో కామెంటరీ బాక్స్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్..  ఆ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ను వివ‌రించాడు. "290 పరుగుల వద్ద ఆడటం చాలా కష్టం" అని బ్రూక్ అనగా,  "నీ కెరీర్‌లో ఎన్ని ట్రిపుల్ సెంచరీలు చేశావ్? అని గిల్ బ‌దులు ఇచ్చిన‌ట్లు అథర్టన్ తెలిపారు.

ఇది జ‌రిగిన త‌ర్వాత ఓవ‌రే గిల్ త‌న వికెట్‌ను కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల‌వుతోంది. కాగా హ్యారీ బ్రూక్ పేరిట ఓ టెస్టు ట్రిపుల్ సెంచ‌రీ ఉంది. గ‌తేడాది పాకిస్తాన్‌తో జ‌రిగిన టెస్టులో బ్రూక్ 317 ప‌రుగులు చేశాడు.

ఇక భార‌త్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 587 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. భార‌త ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు  య‌శ‌స్వి జైశ్వాల్‌( 87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల న‌ష్టానికి 77 ప‌రుగులు చేసింది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement