శెభాష్ శ్రేయ‌స్‌.. టీమిండియా ఫ్యూచ‌ర్ కెప్టెన్ అత‌డే | Sakshi
Sakshi News home page

శెభాష్ శ్రేయ‌స్‌.. టీమిండియా ఫ్యూచ‌ర్ కెప్టెన్ అత‌డే

Published Mon, May 27 2024 4:34 PM

Shreyas Iyer will be next India captain: Robin Uthappa

ఐపీఎల్‌-2024 ఛాంపియ‌న్స్‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం చెన్నై వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్‌.. మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. కేకేఆర్ మూడో సారి టైటిల్ సాధించడంలో ఆ జ‌ట్టు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ది కీల‌క పాత్ర‌. 
 
అయ్య‌ర్ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శన ప‌రంగా ప‌ర్వాలేద‌న్పంచట‌ప్ప‌ట‌కి.. సార‌థిగా మాత్రం జ‌ట్టును అద్భుతంగా న‌డిపించాడు. అయ్య‌ర్ కెప్టెన్సీ 100కు 100 మార్కులు ప‌డాల్సిందే. త‌న వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్ల‌ను అయ్య‌ర్ చిత్తు చేశాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో కేకేఆర్ కేవ‌లం మూడు మ్యాచ్‌ల్లో మాత్రం ఓడిపోయిందంటే అయ్య‌ర్ కెప్టెన్సీ ఏ విధంగా ఉందో ఆర్ధం చేసుకోవ‌చ్చు. 
 
ఈ ఏడాది సీజ‌న్ ఆరంభానికి ముందు అయ్య‌ర్‌కు ఏది క‌లిసిరాలేదు. బీసీసీఐ ఆదేశాల‌ను దిక్క‌రించ‌డంతో జ‌ట్టులో చోటుతో పాటు వార్షిక కాంట్రాక్ట్ ను కూడా కోల్పోయాడు. అయితే ప‌డిలేచిన కేర‌టంలా త‌న కెప్టెన్సీ మార్క్‌ను చూపించాడు. జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపిస్తూ ఏకంగా టైటిల్‌ను అందించాడు. 
 
ఈ ఏడాది సీజ‌న్‌లో శ్రేయస్ 14 ఇన్నింగ్స్‌ల్లో 351 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలో అయ్య‌ర్‌పై భార‌త మాజీ బ్యాట‌ర్ రాబిన్ ఉతప్ప ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. శ్రేయ‌స్‌ను కెప్టెన్‌గా చాలా మంది త‌క్కువ‌గా అంచ‌నా వేశార‌ని ఉత‌ప్ప అభిప్రాయ‌ప‌డ్డాడు. 
 
"శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు అద్బుత‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. అత‌డు భ‌విష్య‌త్తులో క‌చ్చితంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ అవుతాడు. నా వ‌ర‌కు అయితే ఫ్యూచ‌ర్ కెప్టెన్సీ రేసులో శుబ్‌మ‌న్ గిల్ కంటే అయ్యరే ముందుంటాడు. అత‌డు జ‌ట్టును న‌డిపించే విధానం గురించి ఎంత చెప్పుకున్న త‌క్కువే. అత‌డు ఈ ఏడాది సీజ‌న్ నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాడు. 
 
అయ్య‌ర్‌.. గౌతమ్ గంభీర్, చంద్రకాంత్ పండిట్, అభిషేక్ నాయర్ దిగ్గ‌జాల‌తో క‌లిసి ప‌నిచేశాడు. కాబ‌ట్టి ఆ అనుభ‌వం శ్రేయ‌స్‌కు క‌చ్చితంగా క‌లిసిస్తోంది. ఈ ఏడాది సీజ‌న్‌కు ముందు అయ్య‌ర్ ప‌రిస్ధితి అంత‌గా బాగోలేదు. ఫిట్‌నెస్ లోపించడంతో జ‌ట్టులో చోటు కూడా కోల్పోయాడు. 
 
వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతూనే అయ్య‌ర్ ఆడుతున్నాడు. ముఖ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవ‌డం, వ‌ర‌ల్డ్‌క‌ప్ చోటు ద‌క్క‌క‌పోవ‌డం అయ్య‌ర్‌ను మానసికంగా దెబ్బ‌తీశాయి. అయిన‌ప్ప‌ట‌కి అయ్య‌ర్ త‌న బాధ‌ను దిగ‌మింగుకుని కేకేఆర్‌ను ఛాంపియ‌న్స్‌గా నిలిపాడని" జియో సినిమాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఉత‌ప్ప పేర్కొన్నాడు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement