టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయింది. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైనా విమర్శల వర్షం కురుస్తోంది.
ఇక ఐర్లాండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్‌కు.. మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రశ్న ఎదురైంది.
సూర్య నాతో మాట్లాడాడు
ఇందుకు బదులిస్తూ.. ‘‘సూర్యకుమార్ యాదవ్, నేనూ దాదాపుగా ఒకేలా ఆలోచిస్తాము. దేశవాళీ క్రికెట్‌లో అతడితో కలిసి చాలా ఏళ్లు ఆడాను. ఇక్కడికి వచ్చేముందు కూడా సూర్య నాతో మాట్లాడాడు.
యాజమాన్యం ఎలా పనిచేస్తుంది.. వివిధ సందర్భాల్లో ఆటగాళ్లు ఎలా స్పందిస్తారు.. వారి ఆలోచనలు ఏవిధంగా ఉంటాయన్న అంశాలపై నాకు ఇన్‌పుట్స్ ఇచ్చాడు. మా మధ్య సంభాషణ అర్థవంతంగా సాగింది. అతడి నుంచి నేర్చుకోవాల్సి చాలానే ఉంది’’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.
అనూహ్య రీతిలో వేటు
కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్‌పై యాజమాన్యం అనూహ్య రీతిలో వేటు వేసింది. కెప్టెన్‌గా రాణించినా బ్యాటర్‌గా విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణం.
అయితే, సూర్యకు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మరొక్క అవకాశం ఇస్తారని భావించినా.. యాజమాన్యం మాత్రం అతడిని సారథ్య బాధ్యతల నుంచే కాకుండా.. జట్టు నుంచీ తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
చదవండి: IND vs ENG: షెడ్యూల్, జట్లు.. టైమింగ్స్.. పూర్తి వివరాలు


