Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. క‌ట్ చేస్తే! ఇప్పుడు టీమ్‌లోనే నో ఛాన్స్‌ | Shreyas Iyer dropped from Test squad | Sakshi
Sakshi News home page

Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. క‌ట్ చేస్తే! ఇప్పుడు టీమ్‌లోనే నో ఛాన్స్‌

May 24 2025 5:30 PM | Updated on May 24 2025 6:35 PM

Shreyas Iyer dropped from Test squad

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ శ‌నివారం ప్ర‌క‌టించింది. కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ.. క‌రుణ్ నాయ‌ర్‌, కుల్దీప్ యాద‌వ్‌, శార్దూల్ ఠాకూర్‌లను తిరిగి పిలుపునిచ్చింది. అయితే ఛీప్ సెల‌క్ట‌ర్‌ అజిత్ అగార్కర్ అండ్ కో ఎంపిక చేసిన ఈ జ‌ట్టుపై భిన్న‌భిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ముఖ్యంగా స్టార్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను ప‌క్క‌న పెట్ట‌డాన్ని చాలా మంది త‌ప్పుబడుతున్నారు. ఇటీవ‌ల కాలంలో అయ్య‌ర్ దేశ‌వాళీ క్రికెట్‌తో పాటు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. భార‌త్ ఛాంపియ‌న్స్ ట్రోఫీని సొంతం చేసుకోవ‌డంలోనూ శ్రేయ‌స్‌ది కీల‌క పాత్ర‌.

అదేవిధంగా 2024-25 రంజీ ట్రోఫీ సీజ‌న్‌లో శ్రేయస్ అయ్యర్ కేవ‌లం ఏడు ఇన్నింగ్స్‌లలో 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. అయ్య‌ర్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ము లేపుతున్నాడు. ఐపీఎల్‌-2025లో కెప్టెన్‌గా, ఆట‌గాడిగా ఈ ముంబై బ్యాట‌ర్ అద‌ర‌గొడుతున్నాడు. అయితే గ‌తేడాది మాత్రం అయ్య‌ర్ టెస్టుల్లో చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాడు.

శ్రేయ‌స్‌ గత 12 ఇన్నింగ్స్‌లలో 17 సగటుతో 187 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందుకే సెలెక్టర్లు అత‌డిని ప‌క్క‌న పెట్టి ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఏదేమైనా ప్ర‌స్తుత ఫామ్‌ను ప‌రిగణ‌లోకి తీసుకుని అయ్య‌ర్‌ను ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌నకు ఎంపిక చేసి ఉంటే బాగుండేంది అని ప‌లువురు మాజీలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయ్య‌ర్ జ‌ట్టులో ఉంటే మిడిలార్డ‌ర్ ప‌టిష్టంగా ఉంటుంద‌ని మ‌రి కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ అభిమానులైతే ఒక‌డుగు ముందుకు వేసి సెల‌క్ట‌ర్లపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కెప్టెన్‌ కావాల్సిన ఆటగాడికి పూర్తిగా జట్టులోనే ఛాన్స్‌ ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 14 టెస్టులు ఆడి 36.86 స‌గ‌టుతో 811 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో 5 హాఫ్ సెంచ‌రీల‌తో పాటు ఒక సెంచ‌రీ ఉంది.
ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌.. అధికారిక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement