స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు?.. | Sakshi
Sakshi News home page

#ShoaibMalikSaniamirza: ఎల్లలు లేని ప్రేమ: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు?

Published Sat, Jan 20 2024 3:57 PM

Shoaib Malik Sania Mirza: What Went Wrong Fans Left Stunned On Malik Marriage - Sakshi

ప్రేమకు ఎల్లలు ఉండవు.. మనస్ఫూర్తిగా ఒక వ్యక్తిని ఇష్టపడితే తనతో కలిసి బతికేందుకు సరిహద్దులు కూడా దాటడంలో తప్పు లేదంటుంది మనసు! భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా- పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌లకు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయంటారు వాళ్ల సన్నిహితులు.

పాకిస్తానీ అయిన షోయబ్‌ను పెళ్లాడేందుకు హైదరాబాదీ సానియా ఎన్ని అవాంతరాలు ఎదుర్కొందో అందరికీ తెలిసిన విషయమే! ఏది ఏమైనా.. కాబోయే భర్త గురించి వినకూడని మాటలు వినిపించినా లెక్క చేయక అతడిని ధైర్యంగా పెళ్లాడింది సానియా.

అయితే.. టెన్నిస్‌లో సానియా విఫలమైనా.. క్రికెట్‌ మ్యాచ్‌లో షోయబ్‌ ఫెయిలైనా.. రెండు వైపుల నుంచి విమర్శల బాణాలు దూసుకొచ్చేది సానియా మీదకే! టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరిగినా ట్రోలింగ్‌ బాధితురాలు తనే! అయినా.. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరనీయక సానియా కెరీర్‌ పరంగా.. వ్యక్తిగతంగా ముందుకు సాగింది.

పెళ్లైన ఎనిమిదేళ్లకు మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తూ షోయబ్‌తో కలిసి తమ కలల పంట ఇజహాన్‌కు జన్మనిచ్చింది. తల్లైన తర్వాత మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించి కొడుకుతో పాటు టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టింది. 

కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు
నిజానికి.. ఐదేళ్ల వయసులోనే రాకెట్‌ సానియా..  ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో గొప్ప ఘనతలు సాధించింది. డబుల్స్‌లో నంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన ఆమె కెరీర్‌లో మూడు డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌, మూడు మిక్స్‌డ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచింది.

మొత్తంగా తన కెరీర్‌లో 43 డబుల్స్‌ ట్రోఫీలు గులిచింది. 91 వారాలు నంబర్‌ వన్‌గా కొనసాగిన ఘనత తన ఖాతాలో వేసుకుంది. కెరీర్‌లో ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలోనే భర్తతో సానియాకు విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చాయి. షోయబ్‌ మాలిక్‌ ప్రవర్తన నచ్చక ఆమె అతడికి దూరంగా ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. 

ఆ నటితోనూ సాన్నిహిత్యం
నటి అయేషా ఒమర్‌తో షోయబ్‌ సన్నిహితంగా మెలగడం వల్లే దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని పాక్‌ మీడియా కథనాలు ప్రచురించింది. అందుకు తగ్గట్లుగానే సానియా గురించి ఎదురైన ప్రశ్నలకు షోయబ్‌ సమాధానాలు దాటవేయటం.. సానియా సైతం హృదయం ముక్కలైదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ వదంతులకు బలం చేకూరింది.

వీటిని నిజం చేసే విధంగా.. ‘‘వివాహ బంధం.. విడాకులు రెండూ క్లిష్టమైనవే’’ అంటూ సానియా మీర్జా ఇటీవల మరో పోస్టు షేర్‌ చేయడంతో అనధికారికంగా విడాకుల విషయాన్ని ధ్రువీకరించినట్లయింది. తాజాగా.. నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లుగా షోయబ్‌ మాలిక్‌ ఫొటోలు షేర్‌ చేసి అధికారికంగా సానియాతో బంధం తెంచుకున్నట్లు పరోక్షంగా ప్రకటన చేశాడు.

అప్పుడు అలా..
నిజానికి సానియా కంటే ముందే షోయబ్‌ మాలిక్‌ హైదరాబాద్‌కు చెందిన అయేషా సిద్ధిఖీని వివాహం చేసుకున్నాడన్న వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి. 

ఆమెకు విడాకులు ఇ‍వ్వకుండానే సానియాతో పెళ్లికి సిద్ధపడగా.. మధ్యవర్తుల జోక్యంతో వివాదం సద్దుమణిగినట్లు కథనాలు వెలువడ్డాయి. అయేషాతో విడాకుల నేపథ్యంలో షోయబ్‌ ఆమెకు రూ. 15 కోట్ల భరణం కూడా ఇచ్చినట్లు సమాచారం.

అంగరంగ వైభవంగా పెళ్లి
ఈ క్రమంలో ఏప్రిల్‌ 12, 2010లో షోయబ్‌ మాలిక్‌ సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని తాజ్‌ క్రిష్ణ హోటళ్లో సంప్రదాయ పద్ధతిలో వీరి నిఖా జరిగింది. 

భారత్‌- పాకిస్తాన్‌ దేశాలకు చెందిన ఇద్దరు అగ్రశ్రేణి క్రీడాకారుల  పెళ్లి ఇరు దేశాల్లోనూ పెద్ద వార్తగా మారిపోయింది. ఇక పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత సానియా- షోయబ్‌లకు కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు.

అయితే, గత కొన్నేళ్లుగా నటి సనా జావెద్‌తో షోయబ్‌ సన్నిహితంగా మెలుగుతున్నాడన్న కారణంగా సానియా అతడికి దూరంగా ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ పెళ్లి ఫొటోలతో షోయబ్‌ మాలిక్‌ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక షోయబ్‌కు ఇది మూడో పెళ్లి కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి!!

స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు?
ఈ నేపథ్యంలో సానియా- షోయబ్‌ జోడీ అభిమానులు.. ‘‘ప్రేమకు ఎల్లలు ఉండవని సానియా నిరూపించింది. అందరిని ఎదిరించి షోయబ్‌ను పెళ్లాడింది. కానీ చివరకు ఏం మిగిలింది. సానియా- షోయబ్‌ల స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? షోయబ్‌ మాలిక్‌ పోస్ట్‌ మా హృదయాలను ముక్కలు చేసింది’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఈ జంటను ట్రెండ్‌ చేస్తున్నారు.

చదవండి: IND A Vs Eng Lions: భారత జట్టులో తిలక్‌, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన

Advertisement
 
Advertisement