
ఐసీసీ మహిళల టి20 ర్యాంకింగ్స్
దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్–10లోకి దూసుకొచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 176 పరుగులతో మెరిసిన షఫాలీ... ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి 655 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌కు చేరింది. ఫామ్‌లో లేని కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన షఫాలీ పునరాగమనంలో ఇంగ్లండ్‌పై 158.56 స్ట్రయిక్‌రేట్‌తో ఆకట్టుకుంది. దాని ఫలితంగానే ర్యాంకింగ్స్‌లో ముందంజ వేసింది.
ఈ జాబితాలో భారత్ నుంచి స్మృతి మంధాన (767 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. బెత్ మూనీ (794 పాయింట్లు; ఆ్రస్టేలియా), హీలీ మాథ్యూస్ (774 పాయింట్లు; వెస్టిండీస్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ రెండు స్థానాలు కోల్పోయి 14వ ర్యాంక్‌కు పరిమితం కాగా... కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 15వ స్థానంలో కొనసాగుతోంది.
బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ దీప్తి శర్మ (732 పాయిట్లు) ఒక స్థానం కోల్పోయి 3వ ర్యాంక్‌లో ఉండగా... రాధా యాదవ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 15వ ర్యాంక్‌కు చేరింది. పాకిస్తాన్ బౌలర్ సాదియా ఇక్బాల్ అగ్రస్థానంలో ఉంది. హైదరాబాదీ బౌలర్ అరుంధతి రెడ్డి నాలుగు స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌లో నిలిచింది.