
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఘన చరిత్ర ఉన్న సీఎస్‌కే (CSK).. ఈసారి మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే గురిపెట్టిందని పేర్కొన్నాడు. తద్వారా ఆఖరి స్థానంలో ఉండటంలో ఉండే మజాను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతోందంటూ సెటైర్లు వేశాడు.
కాగా ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా చెన్నైకి రికార్డు ఉంది. అయితే, ధోని (MS Dhoni) సారథ్య బాధ్యతల నుంచి నిష్క్రమించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గత సీజన్‌లో కెప్టెన్‌గా వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయాడు.
ఇక ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల తర్వాత గాయపడి రుతు జట్టుకు దూరం కాగా.. ధోని మరోసారి పగ్గాలు చేపట్టాడు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ చెన్నై ఓటమి పాలైంది. ఈ ఎడిషన్‌లో సీఎస్‌కేకు తొమ్మిదింట ఇది ఏడో పరాజయం. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.
తొలిసారి అట్టడుగున.. ఆ కిక్కే వేరప్పా!
ఈ నేపథ్యంలో కామెంటేటర్ వీరేందర్ సెహ్వాగ్ స్పందిస్తూ.. ‘‘చెన్నై పదో స్థానంతో ముగిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ వాళ్లు ఆ పని చేశారంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నపుడు.. ఆ అనుభూతి ఎలా ఉంటుందో వారు అనుభవించగలుగుతారు.
ఎన్నో ఫైనల్స్ ఆడిన తర్వాత ఇలాంటి అనుభవం వారికి అవసరమే’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అదే విధంగా.. వచ్చే ఏడాది చెన్నై నలుగురు ప్లేయర్లను వదులుకుంటేనే బాగుంటుందంటూ ఇద్దరు దేశీ, ఇద్దరు విదేశీ క్రికెటర్ల పేర్లు చెప్పాడు.
ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్‌కే బాగుపడుతుంది
‘‘డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్.. వచ్చే ఏడాది సీఎస్‌కేలో వీరి పేర్లు ఉండకపోవచ్చు. ఒకవేళ నేను గనుక మేనేజ్‌మెంట్ స్థానంలో ఉంటే.. ఆ నలుగురి స్థానాలను కొత్త ముఖాలతో భర్తీ చేస్తాను.
జట్టును నిర్మించడం అంటే ఒక్క సీజన్‌కే పరిమితం కాకూడదు. కనీసం పదేళ్ల పాటు ఆ జట్టు బలంగా ఉండాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది’’ అని సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ హైదరాబాద్
👉వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నై
👉టాస్: హైదరాబాద్.. తొలుత బౌలింగ్
👉చెన్నై స్కోరు: 154 (19.5)
👉హైదరాబాద్ స్కోరు: 155/5 (18.4)
👉ఫలితం: చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్.
చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్‌పై కావ్యా మారన్ ఫైర్!
A milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪
Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025