సాత్విక్‌–చిరాగ్‌ జోడీ బోణీ | Satwik Chirag pair off to a good start at Singapore Open badminton tournament | Sakshi
Sakshi News home page

సాత్విక్‌–చిరాగ్‌ జోడీ బోణీ

May 29 2025 1:32 AM | Updated on May 29 2025 1:32 AM

Satwik Chirag pair off to a good start at Singapore Open badminton tournament

గాయంతో వైదొలిగిన లక్ష్యసేన్‌

పోరాడి ఓడిన ఆకర్షి, ఉన్నతి 

సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ 

సింగపూర్‌: మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో బోణీ కొట్టింది. వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బుధవారం సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–16, 21–13 చూంగ్‌ హోన్‌ జియాన్‌–మొహమ్మద్‌ హైకాల్‌ (మలేసియా) జంటపై గెలుపొందింది. 37 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ద్వయం వరుస గేమ్‌ల్లో విజయం సాధించింది. 

చిరాగ్‌ గాయం కారణంగా ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న ఈ జంట... పూర్తి ఫిట్‌నెస్‌తో కోర్టులో సత్తా చాటింది. ప్రస్తుతం ప్రపంచ 27వ ర్యాంక్‌లో ఉన్న సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి... 41వ ర్యాంకర్‌ మలేసియా జోడీపై ఇది రెండో విజయం. ఈ సీజన్‌లో మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన ఈ జంట... ఆ తర్వాత గాయాల కారణంగా ప్రధాన టోర్నీలకు దూరమైంది.  

ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ 
మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో గాయత్రి గోపీచంద్‌–ట్రెసా జాలీ జోడీ రెండో రౌండ్‌కు చేరుకుంది. బుధవారం తొలి రౌండ్‌లో గాయత్రి–ట్రెసా జంట 21–14, 19–21, 21–17తో చాంగ్‌ చింగ్‌ హూయి–యాంగ్‌ చింగ్‌ టున్‌ (చైనీస్‌ తైపీ) ద్వయంపై గెలచి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌–గద్దె రుత్విక శివాని జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. రోహన్‌–శివాని జంట 21–16, 21–19 చెన్‌ జీ యీ–ఫ్రాన్సెస్కా కార్బెట్‌ (అమెరికా) ద్వయంపై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్, ఉన్నతి హూడా పోరాడి ఓడారు. 

ఆకర్షి కశ్యప్‌ 21–17, 13–21, 7–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ హాన్‌ యీ చేతిలో ఉన్నతి 21–13, 9–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ జీ యీ చేతిలో పరాజయం పాలయ్యారు. సుమారు గంట పాటు సాగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో తొలి గేమ్‌లో విజయం సాధించిన అనంతరం భారత షట్లర్లు పట్టు సడలించి టోర్నీ నుంచి నిష్క్రమించారు. అనుపమా ఉపాధ్యాయ 12–21, 16–21తో సంగ్‌ షో యున్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడగా... మహిళల డబుల్స్‌లో వైష్ణవి–అలీషా జంట పరాజయం పాలైంది. 

లక్ష్యసేన్‌కు గాయం 
పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ లక్ష్యసేన్‌ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. లిన్‌ చున్‌ యూ (చైనీస్‌ తైపీ)తో తొలి రౌండ్‌ మ్యాచ్‌ 21–15, 17–21, 5–13తో ఉన్న సమయంలో గాయం కారణంగా లక్ష్యసేన్‌ వైదొలిగాడు. ‘వెన్ను నొప్పితో లక్ష్యసేన్‌ తొలి రౌండ్‌ నుంచి వైదొలిగాడు. టోర్నీ ఆరంభానికి ముందు ప్రాక్టీస్‌ నుంచే లక్ష్య ఈ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. 

నొప్పి మరింత ఎక్కువ కావడంతో మూడో గేమ్‌ మధ్యలో ఆట నుంచి తప్పుకున్నాడు. లక్ష్యసేన్‌ వీలైనంత త్వరగా కోలుకునే విధంగా వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఇండోనేసియా ఓపెన్‌ వరకు అతడు తిరిగి పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడనే నమ్మకముంది’ అని అతడి తండ్రి, కోచ్‌ డీకే సేన్‌ పేర్కొన్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement