
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసి కొద్ది రోజులు కూడా గడవకముందే తదుపరి సీజన్‌పై చర్చ మొదలైంది. పలానా ఆటగాడు పలానా ఫ్రాంచైజీకి మారతాడు, పలానా ఫ్రాంచైజీ కెప్టెన్‌ను మారుస్తుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ చర్చల్లో ట్రేడింగ్ విండో అందరి దృష్టిని ఆకర్శిస్తుంది.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ విండో ఆప్షన్ ద్వారా చేజిక్కించుకోనుందని ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై సంజూ శాంసన్ కానీ, ఇరు ఫ్రాంచైజీలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా సంజూ సీఎస్‌కే చేరతాడంటూ సోషల్‌మీడియా కోడై కూస్తుంది.
సంజూకు సంబంధించి తాజాగా మరో ప్రచారం మొదలైంది. ఈ కేరలైట్ వచ్చే సీజన్‌లో కేకేఆర్‌కు ఆడబోతున్నాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారానికి కేకేఆర్ స్కౌటింగ్ హెడ్ బిజూ జార్జ్ బీజం వేశాడు. బిజూ తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు.

ఇందులో సంజూ అతను చాలాకాలం క్రితం కలిసి దిగిన ఫోటో ఉంది. ఈ ఫోటోకు బిజూ "కొన్ని జ్ఞాపకాలు ప్రత్యేకమైనవి" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసి నెటిజన్లు సంజూ కోసం కేకేఆర్ పావులు కదుపుతుందని ప్రచారం మొదలుపెట్టారు.
వాస్తవానికి కేకేఆర్‌కు వచ్చే సీజన్ కోసం వికెట్‌కీపర్‌తో పాటు కెప్టెన్ అవసరం ఉంది. సంజూ శాంసన్ ఈ రెండు పాత్రలను న్యాయం చేస్తాడని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం తప్పక భావించవచ్చు. గత సీజన్‌లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో చాలా ఇబ్బంది పడింది.
దీంతో శాంసన్ లాంటి విజవంతమైన నాయకుడు తమ కష్టాలు తీరుస్తాడని కేకేఆర్ అనుకోవడంలో తప్పులేదు. ఎలాగూ ట్రేడింగ్ విండో ఆప్షన్ ఉంది కాబట్టి కేకేఆర్ శాంసన్ కోసం ఎంత డబ్బైనా వెచ్చించవచ్చు. ఏం జరుగుందో తెలియాలంటే మరి కొద్ది రోజుల వెయిట్ చేయాల్సిందే.
కాగా, సంజూ శాంసన్ 2013లో రాజస్థాన్ రాయల్స్‌తో తన జర్నీని ప్రారంభించాడు. అతి కొద్ది కాలంలో శాంసన్ రాయల్స్‌లో కీలక ఆటగాడిగా మారిపోయాడు. మధ్యలో రాజస్థాన్ రాయల్స్ సస్పెండ్ కావడంతో శాంసన్ రెండేళ్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు మారాడు. 2018లో అతని తిరిగి రాయల్స్ గూటికి చేరాడు.
2021 సీజన్‌లో శాంసన్ రాయల్స్ కెప్టెన్సీని చేపట్టాడు. అతని సారథ్యంలో రాయల్స్ 2022 సీజన్‌లో ఫైనల్‌కు చేరింది. తాజాగా ముగిసిన సీజన్‌లో శాంసన్ గాయం కారణంగా పెద్దగా కనిపించలేదు. అతని స్థానంలో రియాన్ పరాగ్ మెజార్టీ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేశాడు. ఈ సీజన్‌లో రాయల్స్ చాలావరకు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది.
రికార్డు ధర
సంజూ శాంసన్ ఐపీఎల్ తర్వాత ఖాళీగా ఉన్నాడు. ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్ వేలంలో సంజూ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. కొచ్చి బ్లూ టైగర్స్ ఫ్రాంచైజీ సంజూను రూ. 26.8 లక్షలకు సొంతం చేసుకుంది. కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో ఇదే భారీ డీల్.