
మేజర్ లీగ్ క్రికెట్-2025లో శనివారం శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు ఉత్కంఠిభరితంగా సాగిన ఈ పోరులో సూపర్ కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. యూనికార్న్స్ బ్యాటర్లలో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (80: 63 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు హసన్ ఖాన్ (40: 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. టెక్సాస్ బౌలర్లలో స్టోయినిష్ మూడు, మోసిన్, అకీల్, బర్గర్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
ఫెర్రీరా పోరాటం వృథా..
అనంతరం లక్ష్య ఛేదనలో టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్‌లో సూపర్ కింగ్స్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను ఆసీస్ స్పీడ్ స్టార్ బార్ట్‌లెట్‌కు షార్ట్ అప్పగించాడు. బార్ట్‌లెట్ ఆ ఓవర్‌లో 11 పరుగులే ఇచ్చి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు.
చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన క్రమంలో కాల్విన్ (2) రనౌట్ కావడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో డొనొవన్ ఫెర్రీరా( 39: 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.
అతడితో పాటు , సాయితేజ ముక్కామల (34), శుభమ్ రంజనె (28) తమవంతు ప్రయత్నం చేశారు. . శాన్ ఫ్రాన్సిస్కో బౌలర్లలో బ్రాడీ కౌచ్ , రొమారియో షెఫర్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా..హసన్ ఖాన్, కరీమా గోరె చెరో వికెట్ తీశారు. ఇప్పటికే ఇరు జట్లు తమ ప్లే ఆఫ్ బెర్త్‌లను ఖారారు చేసుకున్నాయి.
చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్