రుతురాజ్ గైక్వాడ్ (PC: BCCI/X)
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్‌తో భారత్ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
వైభవ్ విఫలం..
అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్‌కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2), వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్‌కు పంపి దెబ్బకొట్టింది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
శతకంతో కదంతొక్కాడు
ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.
మిగిలిన వారిలో ఆయుశ్ బదోని 24, సూర్యాంశ్ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్, వనుజా సాహన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లు
చివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జూన్ సిరీస్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయలేదు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్ భారత్-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్!


