క్రీడా అవార్డుల జాబితా ఇదే..

Rohit Awarded Rajiv Gandhi Khel Ratna Award With Four Others - Sakshi

హిట్‌మ్యాన్‌కు అత్యున్నత క్రీడా పురస్కారం

నాల్గో క్రికెటర్‌గా రోహిత్‌ ఘనత

న్యూఢిల్లీ: టీమిండియా వ‌న్డే టీమ్‌ వైస్ కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వరించింది. ఈ ఏడాదిగాను ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్‌ అయిన రోహిత్‌ శర్మ ఊహించినట్లుగానే ఆ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకోనున్నాడు. ఫలితంగా సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లిల సరసన చేరాడు. అంతకుముందు ఈ ముగ్గురు మాత్రమే ఖేల్‌రత్న దక్కించుకున్న భారత క్రికెటర్లు. క్రీడా మంత్రిత్వ శాఖ ఈరోజు(శుక్రవారం) ప్రకటించిన స్పోర్ట్స్‌ అవార్డుల్లో రోహిత్‌తో పాటు మరో నలుగురు ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికయ్యారు. రోహిత్‌తో పాటు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) సంచలనం మనికా బాత్రా, రియో (2016) పారా ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత మరియప్పన్‌ తంగవేలు, మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ ఖేల్‌రత్న అందుకోనున్నారు.

రిటైర్డ్‌ జస్టిస్‌ ముకుందమ్ శర్మ నేతృత్వంలోని మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌లతో కూడిన 12 మంది సభ్యుల కమిటీ సిఫారసు చేసిన క్రీడా పురస్కారాల జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ  ఆమోదం తెలిపింది. ఇక 27 మందిని అర్జున అవార్డుకు ఎంపిక చేసింది. అయితే రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానులకు అర్జున అవార్డు పురస్కరాలు ఇవ్వడానికి కమిటీ నిరాకరించింది. గతంలోనే వీరు ఖేల్‌రత్న అవార్డులు తీసుకోవడంతో దానికంటే తక్కువైన అర్జున అవార్డును ఇప్పుడు ఇవ్వడం సరైనది కాదని భావించిన సదరు కమిటీ పెదవి విరిచింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌ మహిళా మాజీ బాక్సర్‌ నగిశెట్టి ఉషకు ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.  వైజాగ్‌కు చెందిన 36 ఏళ్ల ఉష 2006 ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజతం, 2008 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం... 2008 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆరు సార్లు సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆట నుంచి రిటైరయ్యాక ఉష 2013 నుంచి 2017 మధ్యకాలంలో పలువురు మహిళా బాక్సర్లకు శిక్షణ ఇచ్చింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top