
గత కొన్నాళ్లుగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాల కారణంగా యుజీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాడు. భార్య ధనశ్రీ వర్మతో అధికారికంగా విడిపోయే ముందే చహల్.. రేడియో జాకీ మహ్‌వశ్ (RJ Mahvash)తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) టోర్నీని వీక్షించేందుకు మహ్‌వశ్‌తో కలిసి చహల్ దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడే ఈ ‘ప్రేమపక్షులు’ కెమెరా కంటికి చిక్కగా చహల్ కొత్త ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే ధనశ్రీ వర్మతో చహల్‌కు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి.
ప్రేమలో ఉన్నట్లు హింట్
అప్పటి నుంచి ఎక్కడ చూసినా చహల్- మహ్‌వశ్ జంటగానే కనిపిస్తున్నారు. ఇటీవల ఓ షోకు హాజరైన చహల్ తాను ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇచ్చేశాడు కూడా!.. మరోవైపు.. మహ్‌వశ్ కూడా చహల్ మాజీ భార్య ధనశ్రీని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పలుమార్లు విమర్శలు గుప్పించింది. భరణం విషయంలోనూ ధనశ్రీ తీరును తప్పుబట్టింది.

చీటింగ్ గురించి మహ్‌వశ్ వీడియో
తాజాగా మరోసారి ఆర్జే మహ్‌వశ్ ఓ ఆసక్తికర వీడియోతో ముందుకు వచ్చింది. ఇది మోసం చేసే కాలం అంటూ.. ‘‘ఓ బంధంలో ఇలాంటి పనులు చేయడం మోసం. అలా చేసేవాళ్లను వాళ్ల కర్మకు వారిని వదిలిపెట్టాలి. వాళ్లు ఇప్పటికే కుంగుబాటుకు గురై ఉంటారు.
మోసానికి గురవుతున్న వ్యక్తి పట్ల మనం సానుభూతి చూపాల్సిందే. ప్రేమ లేదని అతడు రోజూ బాధపడిపోతుంటాడు. అయితే, ప్రేమను వ్యాప్తి చేయడానికి మరొక వ్యక్తి జీవితంలోకి వచ్చి మళ్లీ మోసం చేస్తాడు. ఆ తర్వాత ఇంకొకరిని కూడా మోసం చేసేందుకు సిద్ధపడతాడు.
దేవుడు వారి పనులకు అడ్డుకట్ట వేసేంతవరకు ఏ వ్యక్తి అయినా ఇలాగే చేస్తారు. అలాంటి వాళ్లను రెండుసార్ల కంటే ఎక్కువ క్షమించవద్దు. లేదంటే మీరు బాధపడాల్సి వస్తుంది. నా గత రిలేషన్‌షిప్‌లో ఇదే జరిగింది.
అలాంటి వారిని చూసి మనం జాలి పడి వదిలేయాలి. వారివి చెడు ఆలోచనలు. కానీ మీరు అలా కాదుగా.. వారి కంటే మన జీవితంలోకి గొప్ప వ్యక్తి తప్పక వస్తారు. జీవితం చాలా చిన్నది. కొన్నిసార్లు సరైన వ్యక్తితో కంటే.. తప్పుడు వ్యక్తితోనే మనం ఎక్కువకాలం జీవించాల్సి వస్తుంది’’ అని మహ్‌వశ్ చెప్పుకొచ్చింది.
వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా!
ఈ నేపథ్యంలో చహల్- ధనశ్రీల పేర్లు ప్రస్తావిస్తూ.. ‘‘వేరొకరి భర్తను లాక్కోవడం కూడా మోసమే కదా!’’ అంటూ ఓ నెటిజన్ మహ్‌వశ్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు స్పందిస్తూ... ‘‘నేను ఎవరినీ లాక్కోలేదు. కాబట్టి నాకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు.
ఏదేమైనా వేరొకరి భర్తను లాక్కోవడం కచ్చితంగా మోసం చేయడమే’’ అని పేర్కొంది. అంతేకాదు వ్యూస్ కోసం తనలాంటి వాళ్లను టార్గెట్ చేయడం ఇలాంటివి వారికి అలవాటు అంటూ సెటైర్ వేసింది. దీంతో మరోసారి ఆమె నెటిజన్లకు టార్గెట్ అయింది.
కాగా కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మను ప్రేమించిన చహల్.. 2020, డిసెంబరులో ఆమెను పెళ్లాడాడు. అయితే, వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఈ ఏడాది వీరికి విడాకులు మంజూరయ్యాయి.
అయితే, భార్యకు దూరంగా ఉంటున్న సమయంలోనే మహ్‌వశ్‌తో కలిసి చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కిన చహల్.. తమ బంధం గురించి ఇంకా అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇక చహల్ చివరగా ఇంగ్లండ్ కౌంటీల్లో నార్తాంప్టన్‌షైర్‌కు ఆడాడు.
చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?