
భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ద వాతావరణం నెలకొంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చకునేందుకు భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. తొలుత మంగళవారం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం క్షిపణి దాడులు చేసింది.
దీంతో పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతోంది. అంతేకాకుండా సరిహద్దులో ఉన్న నగరాలపై డ్రోన్ దాడి చేయడానికి యత్నించింది. కానీ భారత్ మాత్రం ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించి డ్రోన్స్‌ను, క్షిపణులను గాల్లోనే నేలకూల్చి దాయాదికి ధీటుగా సమాధనం చెబుతోంది. భారత్ కూడా పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది.
ఈ క్రమంలో భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2025ను పీసీబీ ఆకస్మికంగా నిలపివేసింది. ఈ టోర్నీలో భాగంగా మే 8(గురువారం) రావల్పిండి వేదికగా పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ తలపడాల్సింది. కానీ మ్యాచ్‌కు ముందు రోజు రావల్పిండి స్టేడియం సమీపంలో డ్రోన్ కూలిపోవడంతో పీసీబీ అప్రమత్తమైంది.
వెంటనే ఆ మ్యాచ్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌లను కూడా వాయిదా వేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు వచ్చిన విదేశీ ఆటగాళ్లు సైతం తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ సస్పెన్షన్‌కు ముందు తమ పరిస్థితి ఎలా ఉందో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ వివరించాడు. రెండు రోజుల పాటు భయందోళనకు గురైనట్లు రిషద్ హుస్సేన్ తెలిపాడు.
"ఆ దేవుడు దయవల్ల తీవ్ర ఉద్రిక్తల నడుమ మేము దుబాయ్‌కు చేరుకున్నాము. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మేము లహోర్ నుంచి బయలు దేరిన 20 నిమిషాల తర్వాత విమానాశ్రయంపై మిస్సైల్ ఎటాక్ జరిగిందని దుబాయ్‌లో దిగాక తెలిసింది. ఆ వార్త విని మేము చాలా భయపడ్డాము. నా కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడిపారు.
బాంబు పేలుళ్లు, క్షిపణి దాడుల గురించి వారు తీవ్ర ఆందోళన చెందారు. నిరంతంరం మా ఫ్యామిలీతో టచ్‌లో ఉండేవాడిని. నా సహచర ఆటగాడు నహిద్ రాణా చాలా భయపడ్డాడు. నేను అతడికి టెన్షన్ పడొద్దు అంటూ చెప్పుకుంటూ వచ్చాను. ఏదేమైనప్పటికి మేము దుబాయ్‌కి సురక్షితంగా చేరుకున్నాము.
నహిద్ మాత్రమే కాదు ఇతర విదేశీ ఆటగాళ్లు సామ్ బిల్లింగ్స్, డారిల్ మిచెల్, కుశాల్ పెరెరా, డేవిడ్ వైస్, టామ్ కుర్రాన్ సైతం చాలా భయపడ్డారు. మరోసారి పాకిస్తాన్‌కు తాను తిరిగి రానని మిచెల్ నాతో చెప్పాడు. టామ్ కుర్రాన్ ఓ విమానాశ్రయానికి వెళ్ళాడు. కానీ ఎయిర్‌పోర్ట్ మూసివేయబడింది. దీంతో అతడు చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. అతడిని మేమందరం ఓదార్చాము అని రిషద్ హుస్సేన్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.