సంజూపై ప్రశంసల వర్షం.. బైబై పంత్‌

Rishabh Pant Trolled As Sanju Samson Best Innings IPL 2020 RR Vs MI - Sakshi

రిషభ్‌ పంత్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌

అబుదాబి: రాజస్తాన్‌ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది‌. ఆదివారం నాటి మ్యాచ్‌లో 54 పరుగులతో అజేయంగా నిలిచిన అతడిని క్రీడా నిపుణులు, కామెంటేటర్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలాగే సంజూ కూడా క్రికెట్‌ అభిమానుల ప్రేమను పొందేందుకు అర్హుడని, తాజా హాఫ్‌ సెంచరీతో ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్‌ఆర్‌ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన రాజస్తాన్‌ ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. (చదవండి: రప్ఫాడించిన రాజస్తాన్‌ )

బెన్‌ స్టోక్స్‌(107 నాటౌట్‌; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్‌(54 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)ల అద్భుత ప్రదర్శనతోనే ఇది సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 152 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో, ఆర్‌ఆర్‌ 18.2 ఓవర్లలో, కేవలం రెండు వికెట్లు కోల్పోయి విక్టరీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు సంజూను ప్రశంసిస్తూనే, అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు రిషభ్‌ పంత్‌ను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌లో వీరిద్దరి ఆటతీరును పోలుస్తూ పంత్‌ కంటే సంజూ బెటర్‌ అని పేర్కొంటున్నారు. బ్యాట్స్‌మెన్‌గా, వికెట్‌ కీపర్‌గా మెరుగ్గా రాణించగలిగిన సత్తా ఉన్న సంజూకే తమ ఓటు అంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.(చదవండి: సీఎస్‌కే ఔట్‌; ఇది కేవలం ఆట మాత్రమే: సాక్షి)

‘‘సంజూ శాంసన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరోసారి మా మనసు దోచుకున్నాడు. బై బై రిషభ్‌ పంత్‌. వెళ్లి, హల్వా, పూరీ తింటూ ఉండు సరేనా!’’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా, ‘‘రిషభ్‌ పంత్‌కు బెస్ట్‌ రీప్లేస్‌మెంట్‌ సంజూ శాంసన్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తాచాటగల దమ్మున్న ఆటగాడు’’అంటూ మరొకరు పేర్కొన్నారు. కాగా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సంజూ శాంసన్‌, ఇప్పటివరకు మొత్తంగా 326 పరుగులు చేశాడు. వీటిలో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక పంత్‌ విషయానికొస్తే, ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ 217 పరుగులు చేశాడు. (వరుణ్‌ పాంచ్‌ పటాకా.. ఢిల్లీపై ఘన విజయం) 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top