సీఎస్‌కే ఔట్‌; ఇది కేవలం ఆట మాత్రమే: సాక్షి

Sakshi Dhoni Emotional Poem Over CSK Out Of IPL 2020 Playoffs Race

ప్లే ఆఫ్‌ నుంచి సీఎస్‌కే నిష్క్రమణ: సాక్షి ధోని భావోద్వేగం

అబుదాబి: మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్‌- 2020 సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి, కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండా చతికిలపడింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయం సాధించినప్పటికీ, ఆ గెలుపును అభిమానులు పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి వైదొలిగిన తొలిజట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న సీఎస్‌కే ఆట తీరుతో నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు కెప్టెన్‌ ధోని సతీమణి సాక్షి ధోని సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. ఆటలో గెలుపోటములు సహజమని, తన దృష్టిలో సీఎస్‌కే ఎప్పుడూ విన్నరే అంటూ ఓ పద్యాన్ని షేర్‌ చేశారు.(చదవండి: రుతురాజ్‌ మెరిసె.. సీఎస్‌కే మురిసె)

ఈ మేరకు.. ‘‘ఇది కేవలం ఆట మాత్రమే. కొన్నింటిలో గెలుస్తారు. మరికొన్నింటిలో ఓడిపోతారు!! అద్వితీయమైన విజయాలు, కొన్ని ఓటములు! వాటి వల్ల కొందరికి సంతోషాలు కలిగాయి.. మరికొందరికి గుండెపగిలే వేదన మిగిల్చాయి! కొన్నింటిలో గెలుస్తారు.. మరికొన్నింటిలో ఓడిపోతారు.. ఇంకొన్నింటిని చేజార్చుకుంటారు.. ఇది కేవలం ఆట మాత్రమే! ఇందుకు బదులుగా విభిన్న రకాల స్పందనలు! ఈ భావోద్వేగాలను, క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేందుకు అనుమతినివ్వకూడదు! ఎందుకంటే ఇది కేవలం ఆట మాత్రమే!! ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు, అయితే అందరూ విజేతలు కాలేరు! 

మైదానాన్ని వీడే సమయంలో వినకూడని శబ్దాలు, చూడకూడని సైగలు.. మనోబలంతో వాటిపై పైచేయి సాధించాలి! ఇది కేవలం ఆట మాత్రమే!! మీరు అప్పుడు విజేతలే, ఇప్పుడు కూడా విజేతలే! నిజమైన యోధులు యుద్ధం చేయడం కోసమే పుడతారు.. వాళ్లు అభిమానుల గుండెల్లో ఎల్లప్పుడూ సూపర్‌ కింగ్స్‌ గానే ఉంటారు!!’’అని సాక్షి ధోని సీఎస్‌కే ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు.

కాగా ఈ పోస్టు పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇక గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని, కేదార్‌ జాదవ్‌ పేలవ ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు ధోని కూతురు జీవాపై అత్యాచారానికి పాల్పడతామంటూ బెదిరింపులకు దిగగా, పోలిసులు వారిని అరెస్టు చేశారు. ఇక నిన్న, ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. రుతురాజ్‌ గైక్వాడ్‌  51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 65 పరుగులు సాధించి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

💛

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top