
Photo Courtesy: BCCI
మే 17 నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానున్న వేల ఆర్సీబీకి శుభవార్త అందింది. భారత్-పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన ఆ ఫ్రాంచైజీ ప్లేయర్లంతా తిరిగి వచ్చేందుకు అంగీకరించారని తెలుస్తుంది. జాతీయ విధుల కారణంగా జేకబ్ బేతెల్ ఒక్కడే తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండడని సమాచారం.
స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగొచ్చేందుకు అంగీకరించడం ఆర్సీబీకి అతి పెద్ద శుభవార్త. వాస్తవానికి హాజిల్‌వుడ్ ఐపీఎల్ వాయిదా పడకముందే గాయపడ్డాడు. రీ షెడ్యూల్ తర్వాత అతను అందుబాటులో రావడం దాదాపుగా అసాధ్యమేనని అంతా అనుకున్నారు. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే (జూన్ 11) డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో హాజిల్‌వుడ్ జాతీయ విధులకే ప్రాధ్యాన్యత ఇస్తాడని ప్రచారం జరిగింది.
అయితే ఆర్సీబీ యాజమాన్యం చర్చల కారణంగా హాజిల్‌వుడ్ సీజన్ అయిపోయే వరకు ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. మరోవైపు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా తమ ఆటగాళ్లకు లీగ్ అయిపోయే వరకు కొనసాగేందుకు అనుమతి ఇవ్వడంతో లుంగి ఎంగిడి సేవలు కూడా ఆర్సీబీ లీగ్ అయిపోయే వరకు వినియోగించుకోనుంది.
మిగతా విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. ఫిల్ సాల్ట్ విండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. దీంతో అతను ప్లే ఆఫ్స్‌లో ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. టిమ్ డేవిడ్, లివింగ్‌స్టోన్ వారి జట్లలో సభ్యులుగా లేరు. వీరి నుంచి కూడా ఎలాంటి సమస్య లేదు. ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనా రొమారియో షెపర్డ్ తమ బోర్డును ఒప్పించుకుని లీగ్ మొత్తానికి అందుబాటులోకి వచ్చాడు. మొత్తంగా చూస్తే.. విదేశీ ఆటగాళ్లంతా లీగ్ అయిపోయే వరకు అందుబాటులో ఉండటం ఆర్సీబీకి శుభపరిణామంగా చెప్పవచ్చు.
ఈ సీజన్‌లో ఆర్సీబీ గతంలో ఎన్నడూ లేనట్లుగా హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తుంది. విదేశీ ఆటగాళ్లతో పాటు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా పూర్తిగా అందుబాటులో ఉండటం (టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడం), అందులోనూ భీకర ఫామ్‌లో ఉండటం ఆర్సీబీ తొలి టైటిల్ కలను నెరవేర్చేలా కనిపిస్తుంది.
ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ దేశీయ ఆటగాళ్లు కూడా అత్యంత ప్రమాదకరంగా ఉన్నారు. బౌలర్లలో యశ్ దయాల్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఆర్సీబీ ప్రస్తుమున్న ప్రధాన సమస్య వారి కెప్టెన్ రజత్ పాటిదార్ ఒక్కడే. పాటిదార్ గాయంతో బాధపడుతుండటంతో పాటు పెద్దగా ఫామ్‌లో లేడు.
అతనితో పాటు వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. వీరిద్దరు కూడా లైన్‌లోకి వచ్చారంటే ఈ సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. దేవ్‌దత్ పడిక్కల్ స్థానంలో వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా టాపార్డర్‌లో మ్యాజిక్ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు) ఉన్న ఆర్సీబీ.. ఈ సీజన్‌లో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 17న కేకేఆర్‌తో (బెంగళూరు), మే 23న సన్‌రైజర్స్‌తో (బెంగళూరు), మే 27న లక్నోతో (లక్నో) తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.