RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్‌ ఎమోషనల్‌ | Sakshi
Sakshi News home page

RCB Vs CSK: నా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అతడికి అంకితమిస్తున్నా: డుప్లిసిస్‌

Published Sun, May 19 2024 8:35 AM

RCB Faf du Plessis Dedicate Man Of The Match Award To Yash Dayal

#RCB Vs CSK 

ఐపీఎల్‌ అంటేనే క్రికెట్‌ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ ఛాలెంటర్స్‌(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్‌-17లో ప్లే ఆఫ్ల్స్‌కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైన్నె సూపర్‌ కింగ్స్‌కు షాకిస్తూ మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. 

ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డూప్లిసిస్‌కు మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్‌ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్‌ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్‌కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ‍మ్యాచ్‌లో మా బౌలర్స్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. నాకు వచ్చిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును బౌలర్‌ యశ్‌ దయాల్‌కు అంకితమిస్తున్నాను. యశ్‌ బౌలింగ్‌ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్‌ గెలిచాం. అందుకే తనకు అవార్డ్‌ను అంకితమిస్తున్నా. 

 

 

ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్‌ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. అభిమానులకు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెబుతున్నాను. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం​ ఉంది అంటూ కామెంట్స్‌ చేశాడు. 

 

 

అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్‌..
ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్స్‌ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్‌మెన​్‌ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్‌ (54), కోహ్లి (47), రజత్‌ పటీదార్‌ (41), గ్రీన్‌ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. 

భారీ లక్ష్యంతో ఇన్నింగ్‌ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్‌లో ఉన్న సీఎస్కే కెప్టెన్‌ రుతురాజ్‌ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్‌ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్‌తో మళ్లీ రేసులో నిలిచింది. 

ఈ దశలో ఆర్సీబీ బౌలర్‌ ఫెర్గూసన్‌.. రహానెను ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్‌తో పాటు దూబె, శాంట్నర్‌ ఔట్‌ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్‌కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. 

చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్‌ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్‌ (యశ్‌ దయాళ్‌) తొలి బంతికే ధోని సిక్స్‌ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్‌ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి రెండో బంతికి ధోనీని ఔట్‌ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement