ప్రపంచకప్‌ జట్టులో అశ్విన్‌..! | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ జట్టులో అశ్విన్‌..!

Published Mon, Sep 18 2023 4:51 PM

R Ashwin, Washington Sundar In Line, Rohit Sharma Hints At Late World Cup Squad Calls - Sakshi

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ప్రపంచకప్‌-2023 జట్టుకు ఎంపికయ్యేందుకు ఇంకా దారులు మూసుకుపోలేదు. అతనితో పాటు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయంపై జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసియా కప్‌ -2023 ముగిసిన అనంతరం​ క్లూ ఇచ్చాడు. 

ముందుగా ప్రకటించిన ప్రొవిజనల్‌ జట్టులోని సభ్యుడు, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. అక్షర్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ హుటాహుటిన జట్టులో చేరి ఆసియా కప్‌ ఫైనల్‌ ఆడాడు. అక్షర్‌ గాయం​ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను వరల్డ్‌కప్‌ ఫస్ట్‌ హాఫ్‌ మ్యాచ్‌లకు దూరమవుతాడని తెలుస్తుంది.

ఒకవేళ ఇదే జరిగితే అక్షర్‌ స్థానాన్ని వాషింగ్టన్‌ సుందర్‌ లేదా అశ్విన్‌లలో ఎవరో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. సుందర్‌తో పోలిస్తే అశ్విన్‌ అనుభవజ్ఞుడు కావడంతో అతనికే అవకాశాలు ఉంటాయి. మరోవైపు అక్షర్‌ త్వరలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని సమాచారం. భారత సెలెక్టర్లు ఒకవేళ అశ్విన్‌ను ప్రపంచకప్‌ జట్టులో చేర్చుకోవాలని భావిస్తే, ఆసీస్‌ సిరీస్‌ కోసం ఇవాళ ప్రకటించే భారత జట్టులో అతని చోటు ఇస్తారు.

కాగా, ముందుగా ప్రకటించిన భారత ప్రొవిజనల్‌ వరల్డ్‌కప్‌ స్క్వాడ్‌లో స్పిన్‌ బౌలర్లుగా అక్షర్‌ పటేల్‌తో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి నిమిషంలో ఈ ప్రొవిజనల్‌ జట్టులో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎవరైనా ఆటగాడు గాయం బారిన పడితే, అతని స్థానాన్ని ఇంకొకరితో భర్తీ చేసే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో ఈ నెల 22, 24, 27 తేదీల్లో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం భారత జట్టును ఇవాళ ప్రకటిస్తారు. ఈ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్‌ జట్టులో ఉంటారు. ఆసియా కప్‌ సందర్భంగా గాయపడిన అక్షర్‌ స్థానంలో సెలెక్టర్లు ఎవరిని తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్‌ ముగిశాక అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్‌కప్‌ జర్నీ స్టార్ట్‌ అవుతుంది. అక్టోబర్‌ 14న భారత్‌.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఢీకొంటుంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement