
నేటి నుంచి మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
ఈ ఏడాది ఒక్క టైటిల్ గెలవలేకపోయిన భారత షట్లర్లు
కౌలాలంపూర్: ఈ ఏడాది స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో టోరీ్నకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
గత కొంత కాలంగా లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ ఈసారైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. గత నెల సుదిర్మన్ కప్‌లో భాగంగా ఇండోనేసియా, డెన్మార్క్ చేతిలో ఓడిన ఈ ఇద్దరు తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నారు.
ఒలింపిక్స్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన సింధు ప్రస్తుతం ప్రపంచ 16వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్ నుగుయెన్ థుయ్ లిన్ (వియత్నాం)తో సింధు తలపడుతుంది.
పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)తో 35వ ర్యాంకర్ ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మూడో సీడ్ చౌ టైన్ చెన్ (చైనీస్ తైపీ)తో సతీశ్ కుమార్ కరుణాకరన్, బ్రియాన్ యంగ్ (కెనడా)తో ఆయుశ్ శెట్టి, జియా హెంగ్ జాసన్ (సింగపూర్)తో ప్రియాన్షు రజావత్ తలపడనున్నారు. మహిళల సింగిల్స్‌లో సింధుతో పాటు ఉన్నతి హూడా, ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్ పోటీ పడుతున్నారు.
పురుషుల డబుల్స్‌లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి, హరిహరన్–రూబన్ కుమార్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో నాలుగు జోడీలు పోటీలో ఉన్నాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో రుతి్వక శివాని–రోహన్ కపూర్, ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, అషిత్ సూర్య–అమృత, ఆద్య–సతీశ్ కుమార్ బరిలో దిగనున్నారు. ఇక ప్రధాన పోటీలకు ముందు జరగనున్న క్వాలిఫయింగ్ టోర్నీ పురుషుల విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌తో పాటు శంకర్ ముత్తుస్వామి, తరుణ్ మన్నెపల్లి మంగళవారం బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగం నుంచి అన్‌మోల్ పోటీలో ఉంది.