మరో డబుల్‌ సాధించిన పుజారా.. 28 ఏళ్ల కిందటి రికార్డు సమం | Sakshi
Sakshi News home page

Pujara: మరో డబుల్‌ సాధించిన పుజారా.. 28 ఏళ్ల కిందటి రికార్డు సమం

Published Sun, May 1 2022 5:02 PM

Pujara Scores Second Double Ton In County Championship - Sakshi

పేలవ ఫామ్‌ కారణంగా టీమిండియాలో స్థానం కోల్పోయిన చతేశ్వర్‌ పుజారా ఇంగ్లండ్‌ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మూడంకెల స్కోర్‌ను అందుకున్నాడు. ఇందులో రెండు డబుల్‌ సెంచరీలు ఉండటం విశేషం. టీమిండియాతో పాటు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కూడా పట్టించుకోలేదన్న కసితో రగిలిపోతున్న పుజారా.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్‌ 2022లో పరుగుల వరద పారిస్తున్నాడు. 

ప్రస్తుత సీజన్‌లో ససెక్స్‌కు ఆడుతున్న అతను.. 3 మ్యాచ్‌ల్లో రెండు డబుల్‌ సెంచరీలు (201*, 203), ఓ సెంచరీ (109) సాయంతో ఏకంగా 531 పరుగులు సాధించాడు. తాజాగా డర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్‌) ద్విశతకం బాదిన పుజారా.. తన జట్టును పటిష్టమైన స్థితిలో ఉంచాడు. ఈ క్రమంలో అతను 28 ఏళ్ల కిందటి ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. కౌంటీ క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌ తర్వాత రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

కాగా, ససెక్స్‌తో జరుగుతున్న డివిజన్‌-2 మ్యాచ్‌లో టాస్ గెలిచిన డర్హమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ససెక్స్‌ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పుజారా (334 బంతుల్లో 203; 24 ఫోర్లు) డబుల్‌ సెంచరీతో సత్తా చాటడంతో ససెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 538 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. ఈ క్రమంలో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన డర్హమ్‌.. నాలుగో రోజు (మే 1) తొలి సెషన్‌ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 245 పరుగులు చేసింది. ఓపెనర్లు సీన్‌ డిక్సన్‌ (148 నాటౌట్‌), అలెక్స్‌ లీస్‌ (84 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. 
చదవండి: పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్‌

Advertisement
Advertisement