ఇంగ్లండ​ గడ్డపై ఇరగదీసిన చహల్‌ | Yuzvendra Chahal Lights Up County Cricket With A Stunning 6 Wicket Haul | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ​ గడ్డపై ఇరగదీసిన చహల్‌

Jul 30 2025 8:36 PM | Updated on Jul 30 2025 9:23 PM

Yuzvendra Chahal Lights Up County Cricket With A Stunning 6 Wicket Haul

టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ ఇంగ్లండ్‌ గడ్డపై ఇరగదీశాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌-2లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను.. డెర్బీషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరు వికెట్లతో చెలరేగాడు. చహల్‌కు కౌంటీల్లో ఇదే తొలి ఆరు వికెట్ల ప్రదర్శన. 

గత సీజన్‌లో అతను రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ప్రస్తుత ప్రదర్శనతో కలుపుకొని ఈ సీజన్‌లో చహల్‌ 3 మ్యాచ్‌ల్లో 47.30 సగటున 10 వికెట్లు తీశాడు.

ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 43 మ్యాచ్‌లు ఆడిన చహల్‌.. 35.63 సగటున 119 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో మెరుగైన ట్రాక్‌ రికార్డు ఉన్నప్పటికీ చహల్‌ ఇంతవరకు భారత్‌ తరఫున ఒక్క టెస్ట్‌ అవకాశం కూడా రాలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ చహల్‌కు ఇటీవల అవకాశాలు తక్కువ అవుతున్నాయి. 

యువ స్పిన్నర్ల రాకతో చహల్‌ కేవలం ఐపీఎల్‌కే పరిమితమయ్యాడు. చహల్‌ భారత్‌ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడి వరుసగా 121, 96 వికెట్లు తీశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నార్తంప్టన్‌షైర్‌, డెర్బీషైర్‌ మధ్య మ్యాచ్‌ నిన్న మొదలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డెర్బీ.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ మార్టిన్‌ ఆండర్సన్‌ సెంచరీతో (105) కదంతొక్కడంతో 377 పరుగులు చేసింది. 

చహల్‌ (33.2-5-118-6) ఆరు వికెట్ల ప్రదర్శనతో డెర్బీషైర్‌ను దెబ్బేశాడు. నార్తంప్టన్‌ బౌలర్లలో గుత్రీ, లూక్‌ ప్రాక్టర్‌, స్క్రిమ్‌షా, రాబర్ట్‌ కియోగ్‌ తలో వికెట్‌ తీశారు. డెర్బీ ఇన్నింగ్స్‌లో ఎట్చిన్సన్‌ (45), రీస్‌ (39), అనురిన్‌ డొనాల్డ్‌ (37), జాక్‌ చాపెల్‌ (32), జో హాకిన్స్‌ (34 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నార్తంప్టన్‌ రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. రికార్డో (8), మెక్‌మనస్‌ (17), జేమ్స్‌ సేల్స్‌ (35) ఔట్‌ కాగా.. లూక్‌ ప్రాక్టర్‌ (68), జార్జ్‌ బార్ట్‌లెట్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. డెర్బీ బౌలర్లలో రీస్‌, టిక్నర్‌, జాక్‌ చాపల్‌కు తలో వికెట్‌ దక్కింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement