
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌గా ఫీలయ్యే బాబర్ ఆజమ్ తన క్రికెటింగ్ ప్రస్థానంలో దినదినాభివృద్ధి చెందుతున్నాడు. గత కొంతకాలంగా చెత్త ప్రదర్శనలతో అదఃపాతాళానికి పడిపోయిన బాబర్.. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు.
పీఎస్‌ఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌లో డకౌటైన బాబర్.. రెండో మ్యాచ్‌లో 1, మూడో మ్యాచ్‌లో 2, నిన్న (ఏప్రిల్ 21) జరిగిన నాలుగో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లికి పోటీ అని చెప్పుకునే బాబర్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు చూసి క్రికెట్ అభిమానులు వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా 0, 1, 2, 46 స్కోర్లు చూసి బాబర్ దినదినాభివృద్ధి చెందుతున్నాడని సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
పీఎస్‌ఎల్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బాబర్ ఈ సీజన్‌లో కెప్టెన్‌గానూ తేలిపోయాడు. తన జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట ఓటమిపాలైంది. నిన్న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.
విశేషమేమిటంటే పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమే (46) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో మహ్మద్ హరీస్ (28), అల్జరీ జోసఫ్ (24 నాటౌట్), తలాత్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. సైమ్ అయూబ్ 4, టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ 7, మిచెల్ ఓవెన్ 5, అబ్దుల్ సమద్ 2, లూక్ వుడ్ 2 పరుగులకు ఔటయ్యారు. కరాచీ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో 3 వికెట్లు తీయగా.. ఆమెర్ జమాల్, మీర్ హమ్జా చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ కూడా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కరాచీ గెలుపుకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60) గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (23 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేసి కరాచీని విజయతీరాలకు చేర్చాడు. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ 3, అలీ రజా 2, అల్జరీ జోసఫ్, ఆరిఫ్ యాకూబ్ తలో వికెట్ పడగొట్టారు.