కొంప‌ముంచిన రుతురాజ్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లో వింత ర‌నౌట్‌! | Priyansh Arya-Ruturaj Gaikwad Involved Bizarre Run Out IND-A Vs SL-A | Sakshi
Sakshi News home page

కొంప‌ముంచిన రుతురాజ్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లో వింత ర‌నౌట్‌!

Jun 9 2026 1:28 PM | Updated on Jun 9 2026 1:51 PM

Priyansh Arya-Ruturaj Gaikwad Involved Bizarre Run Out IND-A Vs SL-A

ఇండియా-ఏ, శ్రీలంక‌-ఏ మ‌ధ్య జ‌రుగుతున్న వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ స‌మయంలో ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ర‌నౌట్‌కు మ్యాచ్ సాక్ష్యంగా నిలిచింది. విష‌యంలోకి వెళితే.. ఓపెనర్దిద్ద‌రు తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేర‌డంతో రుతురాజ్‌, ప్రియాన్ష్ ఆర్య‌లు ఆచితూచి ఆడారు. ఇద్ద‌రు క‌లిసి చాలా బంతులెదుర్కొని 53 ప‌రుగులు జోడించారు. 

ఇద్దరి మధ్య భాగ‌స్వామ్యం బ‌ల‌ప‌డుతున్న త‌రుణంలో రుతురాజ్ చేసిన త‌ప్పిదం కొంప‌ముంచింది. ర‌విందు ఫెర్నాండో వేసిన‌ ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్ తొలి బంతినే గైక్వాడ్ సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఆ త‌ర్వాత బంతికే హైడ్రామా చోటుచేసుకుంది. పాయింట్ దిశ‌గా ఆడిన రుతురాజ్ రెండు ప‌రుగుల కోసం ప్ర‌య‌త్నించాడు. 

అయితే స్ట్రైక్ ఎండ్‌వైపు ఉన్న ప్రియాన్ష్ ఆర్య రుతురాజ్ రెండో ప‌రుగు కోసం వ‌చ్చిన విష‌యం గ‌మ‌నించ‌లేదు. అప్ప‌టికే క్రీజులో బ్యాట్ పెట్టాడు. కానీ అప్ప‌టికే రుతురాజ్ స్ట్రైక్ ఎండ్‌వైపు వ‌చ్చేశాడు. ఈలోగా బంతిని కీప‌ర్ బౌల‌ర్ వైపు విసిరే క్రమంలో ప్రియాన్ష్‌ బ్యాట్‌ను తొక్కడం కనిపించింది. ఇంతలో కీపర్‌ నుంచి బంతిని అందుకున్న బౌలర్‌ వికెట్లను గిరాటేశాడు. 

ఈ నేపథ్యంలో ఇద్ద‌రు బ్యాట‌ర్లు ఒకే ఎండ్‌లో ఉండ‌డంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎవ‌రు బ్యాట్‌ను మొద‌ట‌గా క్రీజులో పెట్టార‌నేది అంపైర్లు ప‌రిశీలించారు. రిప్లేలో ప్రియాన్ష్ ఆర్య బ్యాట్ క్రీజుపై ఉంచిన‌ప్ప‌టికీ, ప్రియాన్ష్ కంటే ముందే రుతురాజ్ బ్యాట్‌ను క్రీజులో ఉంచ‌డం క‌నిపించింది. 

దీంతో అంపైర్లు ప్రియాన్ష్ ఆర్య‌ను ర‌నౌట్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇద్ద‌రి మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం కారణంగా ఈ వింత ర‌నౌట్ జ‌రిగింది. ఇలాంటి వింత ర‌నౌట్ల‌కు పాకిస్తాన్ పెట్టింది పేరు. ఇప్పుడు రుతురాజ్‌, ప్రియాన్ష్‌లు వింత ర‌నౌట్‌తో వార్త‌ల్లోకెక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

మ్యాచ్ విష‌యానికొస్తే 69 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రుతురాజ్ గైక్వాడ్ (101), కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ (60 బ్యాటింగ్‌) ఆదుకున్నారు. ఈ ఇద్ద‌రు నాలుగో వికెట్‌కు 150 ప‌రుగులు జోడించారు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో మంచి రికార్డు క‌లిగిన రుతురాజ్ మ‌రోసారి ఆ న‌మ్మ‌కాన్ని నిలుపుకుంటూ సెంచ‌రీతో మెరిశాడు. 

అయితే సెంచ‌రీ చేసిన మ‌రుక్ష‌ణ‌మే రుతురాజ్ వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం ఇండియా-ఏ 45 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 4 వికెట్ల న‌ష్టానికి 224 ప‌రుగులు చేసింది. అంత‌క‌ముందు ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ (14) ఫామ్‌ను కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.

చదవండి: మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్‌ అరుదైన ఫీట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement