PKL 12: ఆరోజే ఆరంభం.. వైజాగ్‌లో తొలి మ్యాచ్‌.. పూర్తి వివరాలు | PKL 12 Telugu Titans Vs Tamil Thalaivas In Opener In Vizag August 29 | Sakshi
Sakshi News home page

PKL 12: ఆరోజే ఆరంభం.. వైజాగ్‌లో తొలి మ్యాచ్‌.. పూర్తి వివరాలు

Jul 31 2025 6:57 PM | Updated on Jul 31 2025 7:20 PM

PKL 12 Telugu Titans Vs Tamil Thalaivas In Opener In Vizag August 29

PKL 11 ట్రోఫీతో విజేత హర్యానా స్టీలర్స్‌ జట్టు

సాక్షి, విశాఖపట్నం: కబడ్డీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. ఆగష్టు 29న  ప్రారంభం కానున్న ఈ మెగా కబడ్డీ టోర్నమెంట్‌ను నాలుగు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ఈసారి వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాలు 12 జట్లు తలపడే  ఈ మెగా లీగ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

వైజాగ్‌లో గ్రాండ్ ఓపెనింగ్..
ప్రొ కబడ్డీ 12వ సీజన్ ప్రారంభ వేడుకలు వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరగనున్నాయి. ఆగస్టు 29 శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్‌తో తలపడనుంది. అదే రోజు జరిగే రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టాన్‌ను ఢీకొట్టనుంది.

ఇక ఆగస్టు 30న, తెలుగు టైటాన్స్ మరోసారి బరిలోకి దిగి యూపీ యోధాస్‌తో పోటీపడనుంది. ఆ తర్వాత జరిగే మ్యాచ్‌లో యు ముంబా, గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇక సూపర్ సండే 30న తలైవాస్, యు ముంబా మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.

మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ తమ టైటిల్ వేటను బెంగాల్ వారియర్స్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత పీకేఎల్ మళ్లీ వైజాగ్‌కు రావడం విశేషం. గతంలో 2018లో ఆరో సీజన్‌కు అంతకుముందు 1,3 వ సీజన్ పోటీలకు అతిథ్యం ఇచ్చిన ఈ నగరంలో ఇప్పుడు మళ్ళీ కబడ్డీ సందడి నెలకొననుంది.

చాలా ఆనందంగా ఉంది
ఈ సందర్భంగా ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్  అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ, "ప్రో కబడ్డీ లీగ్ ఎదుగుదలలో 12వ సీజన్  ఒక కొత్త అధ్యాయం. ఈ మల్టీ-సిటీ ఫార్మాట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల వద్దకు అత్యుత్తమ కబడ్డీ యాక్షన్‌ను తీసుకువెళ్తున్నాం. 

ముఖ్యంగా ఈ ఆటకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విశాఖపట్నంకు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు. కాగా 12వ సీజన్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో మషల్ స్పోర్ట్స్, జియోస్టార్  కలిసి ఈ లీగ్‌ను దేశంలో అత్యంత విజయవంతమైన స్పోర్ట్స్ లీగ్స్ లో ఒకటిగా నిలబెట్టాయి. ప్రో కబడ్డీ లీగ్  మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో హాట్‌స్టార్‌ లో లైవ్ స్ట్రీమ్ అవుతాయి.

మిగతా నగరాల్లో షెడ్యూల్
జైపూర్
వైజాగ్‌లో తొలి అంచె ముగిసిన తర్వాత సెప్టెంబర్ 12 నుంచి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక్కడ జరిగే తొలి పోరులో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్‌తో తలపడనుంది. 10వ సీజన్‌లో చారిత్రాత్మక 1000వ మ్యాచ్‌కు జైపూర్ ఆతిథ్యం ఇచ్చింది.

చెన్నై
సెప్టెంబర్ 29 నుంచి చెన్నైలోని ఎస్‌డీఏటీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో మూడో లెగ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ.. హర్యానా స్టీలర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ రైడర్ నవీన్ కుమార్ తన మాజీ జట్టుపై పోటీపడనుండటం ఆసక్తి రేపుతోంది.

ఢిల్లీ
అక్టోబర్ 13 నుంచి ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో లీగ్ చివరి దశ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లేఆఫ్స్‌కు ముందు అభిమానులకు మరింత వినోదాన్ని పంచేందుకు, ఈ దశలో ట్రిపుల్ హెడర్ (రోజుకు మూడు మ్యాచ్‌లు) మ్యాచ్‌లు కూడా నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement