పేస్‌కు, స్పిన్‌కు మధ్య సమరం.. నేటి నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ మధ్య తొలి టెస్టు | Pakistan Vs Bangladesh First Test To Start From August 21st | Sakshi
Sakshi News home page

పేస్‌కు, స్పిన్‌కు మధ్య సమరం.. నేటి నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ మధ్య తొలి టెస్టు

Aug 21 2024 6:59 AM | Updated on Aug 21 2024 8:50 AM

Pakistan Vs Bangladesh First Test To Start From August 21st

రావల్పిండి: పేసర్లతో పటిష్టంగా పాకిస్తాన్‌.. స్పిన్నర్లే ప్రధాన బలంగా బంగ్లాదేశ్‌.. టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్‌ (డబ్ల్యూటీసీ)లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 13 టెస్టులు జరిగాయి. బంగ్లాదేశ్‌ ఒక్కసారి కూడా టెస్టుల్లో పాక్‌ను ఓడించలేకపోయింది. ఈసారి మాత్రం గెలుపుతో చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది. 

ఆ్రస్టేలియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్‌ సొంతగడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. మొదటి టెస్టు జరగనున్న రావల్పిం​డి పిచ్‌ పేస్‌తో పాటు బ్యాటింగ్‌కు సహకరించనుంది. ఇక్కడ జరిగిన గత నాలుగు టెస్టుల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. షాహీన్‌ షా అఫ్రీది, నసీమ్‌ షా, ఖుర్రం షహజాద్, మొహమ్మద్‌ అలీతో పాకిస్తాన్‌ పేస్‌ విభాగం దుర్బేధ్యంగా కనిపిస్తుంటే.. ప్రధాన స్పిన్నర్లు షకీబ్‌ అల్‌ హసన్, మెహదీ హసన్‌ మిరాజ్‌నే బంగ్లాదేశ్‌ నమ్ముకుంటోంది. సుదీర్ఘ కాలంగా బంగ్లాదేశ్‌ జట్టులో ప్రధాన పాత్ర పోషిస్తున్న షకీబ్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భారీ ఆశలు పెట్టుకుంది. 

‘అతడు చాన్నాళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాజకీయ విషయాలు అతడి ఆటతీరుపై ప్రభావం చూపవు. ఈ సిరీస్‌లో అతడు ఏదైనా ప్రత్యేకంగా చేస్తాడనుకుంటున్నాం. పాకిస్తాన్‌ పేసర్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదని తెలుసు. అయినా రాణించగలమనే నమ్మకం ఉంది’ అని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజు్మల్‌ షాంటో పేర్కొన్నాడు.

ఆ్రస్టేలియా మాజీ పేసర్‌ జాసన్‌ గెలెస్పీ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాకిస్తాన్‌ ఆడుతున్న తొలి టెస్టు సిరీస్‌ ఇదే కాగా... బ్యాటింగ్‌లో బాబర్‌ ఆజమ్, అబ్దుల్లా షఫీఖ్, షాన్‌ మసూద్, సౌద్‌ షకీల్, మొహమ్మద్‌ రిజ్వాన్‌ కీలకం కానున్నారు. బంగ్లా తరఫున నజ్ముల్‌ షాంటో, మోమినుల్‌ హక్, ముష్ఫికర్‌ రహీమ్, షకీబ్, లిటన్‌ దాస్‌ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. 

మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట సాగే ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ (36.66 పాయింట్లు) ఆరో స్థానంలో.. బంగ్లాదేశ్‌ (25.00 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement