టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్‌ రిజ్వాన్‌ | Pakistan New ODI Captain Rizwan Sends Loud Message To India On Champions Trophy | Sakshi
Sakshi News home page

CT 2025: టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్‌ రిజ్వాన్‌

Published Wed, Oct 30 2024 6:42 PM | Last Updated on Wed, Oct 30 2024 7:26 PM

Pakistan New ODI Captain Rizwan Sends Loud Message To India On Champions Trophy

చాంపియన్స్‌ ట్రోఫీ రూపంలో వచ్చే ఏడాది మరో ఐసీసీ టోర్నీ అభిమానులకు వినోదం పంచనుంది. పాకిస్తాన్‌ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా పాల్గొంటుందా? లేదా? అన్న అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి రోహిత్‌ సేనను పాకిస్తాన్‌కు పంపేందుకు సుముఖంగా లేదు.

వారి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు
ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ విధానంలో టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించాలని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే, పాక్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి జట్లు తమ దేశంలో పర్యటించాయి కాబట్టి.. భారత జట్టు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. లాహోర్‌ వేదికగా టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని పాక్‌ బోర్డు చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ కూడా ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడి వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాఫ్రీ అలార్డిస్‌ కూడా చాంపియన్స్‌ ట్రోఫీ వేదికను మార్చబోమని స్పష్టం చేశాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మెగా టోర్నీలో ఆడకుండా బహిష్కరిస్తే మాత్రం భారీ నష్టం తప్పదు. ‍భారత జట్టు టోర్నమెంట్లో లేకుంటే.. ప్రసార హక్కులు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రారని ఇంగ్లండ్‌ బోర్డు పెద్దలు సైతం అభిప్రాయపడ్డారు.

టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక..
ఈ క్రమంలో పాకిస్తాన్‌ వన్డే, టీ20 జట్ల కొత్త కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తమ దేశానికి రావాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘పాకిస్తాన్‌లోని క్రికెట్‌ అభిమానులకు టీమిండియా ఆటగాళ్లు అంటే ఎంతో ఇష్టం. తమ దేశంలో భారత క్రికెటర్లు ఆడుతుంటే చూడాలని వారు ఆశపడుతున్నారు.

మేము భారత్‌కు వెళ్లినపుడు అక్కడ మాకు సాదర స్వాగతం లభించింది. అయితే, వాళ్లు చాంపియన్స్‌ ట్రోఫీ ఆడటానికి ఇక్కడికి వస్తారో లేదో తెలియదు.. ఒకవేళ వస్తే మాత్రం టీమిండియాకు ఇక్కడ ఘన స్వాగతం లభిస్తుంది’’ అని రిజ్వాన్‌ పేర్కొన్నాడు. 

కాగా వన్డే వరల్డ్‌కప్‌ ఆడేందుకు గతేడాది పాక్‌ జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బాబర్‌ ఆజం ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. పాక్‌ బోర్డు ఆ బాధ్యతలను వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌కు అప్పగించింది. 

చదవండి: Expensive Players In IPL: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement