
ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్- 2025 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్‌గా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం లీసెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్‌ను 31 పరుగుల తేడాతో పాకిస్తాన్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
పాక్ బ్యాటర్లలో ఉమర్ అమీన్(58) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షోయబ్ మాలిక్(46) కీలక నాక్ ఆడాడు. అతడితో పాటు ఆసిఫ్ అలీ(23), షర్జీల్ ఖాన్(19) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఓలీవర్ రెండు, విజోలన్, డుమినీ, పార్నల్ తలా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా ఛాంప్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగల్గింది.
సఫారీ బ్యాటర్లలో మోర్నే వాన్ వైక్(44) మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో హాఫీజ్, తన్వీర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాలిక్, రియాజ్, సోహిల్ ఖాన్, వసీం తలా వికెట్ సాధించారు. కాగా పాకిస్తాన్ ఛాంపియన్స్, ఇండియా ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా డబ్ల్యూసీఎల్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.