ఒడిశాలోని కటక్ నగరంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టి20 మ్యాచ్ మంగళవారం రాత్రి జరగనుంది. స్థానిక బారామతి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ టికెట్ల కోసం నాలుగు రోజుల క్రితం అభిమానులు పోటెత్తారు. టికెట్లు దక్కించుకునేందుకు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు అభిమానులు వెనుకాడలేదని స్థానిక మీడియా వెల్లడించింది. క్రికెట్ అంటే పిచ్చా అనేంతగా ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడ్డారు. కటక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నువాగర్ గ్రామంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. కారణం 21 ఏళ్ల క్రితం జరిగిన ఓ విషాదం.
ఏం జరిగింది?
జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని నువాగర్ గ్రామం (Nuagarh village) ఒకప్పుడు క్రికెట్‌కు ప్రసిద్ధి. ఆ ఊరి ప్రజలకు క్రికెట్ అంటే ఇష్టం. 2004 ముందు వరకు గ్రామస్తులు నిరంతరం క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తూ ఉండేవారు. దీంతో ఆ ఊరిలో ఎప్పుడు చూసినా క్రికెట్ సందడి కనిపించేది. అంతేకాదు నువాగర్ గ్రామానికి ప్రత్యేకంగా ఉత్కల్‌మణి క్రికెట్ క్లబ్ పేరుతో ఒక జట్టు కూడా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంది. 2004, మార్చి 1 ముందు వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ రోజు నువాగర్ గ్రామం చరిత్రలో దుర్దినంగా మిగిలిపోయింది.
కేంద్రపార జిల్లా మహాకలపాడలో స్థానిక టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 2004, మార్చి 1న ఉత్కల్‌మణి క్రికెట్ క్లబ్ (Utkalmani youth club) జట్టు పడవలో బయలుదేరింది. 15 మంది ఆటగాళ్లు, మరో ఏడుగురు కలిసి పయనమయ్యారు. బహాకుడా ఘాట్ సమీపంలో దురదృష్టవశాత్తు పడవ ప్రమాదానికి గురవడంతో 13 మంది క్రికెటర్లు మహానదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఊహించని విషాదంతో నువాగర్ గ్రామం దిగ్బ్రాంతికి గురైంది. అప్పటివరకు స్థానికంగా క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆ ఊరిలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. క్రికెట్‌కు ఫుల్‌స్టాప్ పడింది. ఆ దుర్ఘటన తర్వాత తమ ఊరిలో క్రికెట్ ఆడరాదని గ్రాస్తులంతా నిర్ణయం తీసుకున్నారని నువాగర్ మాజీ సర్పంచ్ సుధాల్ స్వాన్ మీడియాకు తెలిపారు.
పెళ్లైన 6 నెలలకే..
పడవ ప్రమాదంలో చనిపోయిన 13 మంది ఆటగాళ్ల పేరుతో 2007లో స్మారక స్థూపం (memorial pillar) ఏర్పాటు చేశారు. ఈ దుర్ఘటన రోజాలిని జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె భర్త బిశ్వజిత్ రే ఈ ప్రమాదంలో చనిపోయాడు. వారిద్దరికీ పెళ్లయి అప్పటికే ఆరు నెలలు మాత్రమే అయింది. ''నా భర్త కుడిచేతి వాటం బ్యాటర్, మీడియం పేస్‌బౌలర్. అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గానూ ఉండేవాడు. క్రికెట్‌పై ఉన్న మక్కువే అతడి ప్రాణాలు తీసింది. చనిపోయిన 13 మంది క్రీడాకారుల కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగం రూ. 25 వేలు చొప్పున సహాయం అందించింద''ని రోజాలిని గుర్తు చేసుకున్నారు.
క్రికెట్ చూడకూడదనుకున్నాం
ఇదే దుర్ఘటనలో చనిపోయిన ప్రదీప్ పరిడా కుటుంబానికి దాదాపు ఇదే పరిస్థితి. ఏడాది ముందే అతడికి పెళ్లైంది. ''నదిలో మునిగి చనిపోయిన 13 మందిలో నా భర్త కూడా ఉన్నాడు. నాతో పాటు, ఆరు నెలల కూతురిని వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయాడు. మా ఊరిలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత క్రికెట్ చూడకూడదని నిర్ణయించుకున్నామ''ని ప్రదీప్ భార్య టికీ చెప్పారు.
చదవండి: హెచ్‌సీఏ తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం


