ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీతో పోలిస్తే క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీ ఇంత తక్కువా..?

ODI World Cup and FIFA World Cup Winners Prize Money Comparison - Sakshi

విశ్వవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్‌, క్రికెట్‌ రెండు సరిసమానంగా ఉంటాయి. ఇటీవలికాలంలో ఫుట్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్‌కు ప్రజాదరణ పెరిగిందనే చెప్పాలి. పాశ్యాత్య దేశాల్లో సైతం క్రికెట్‌కు విపరీతంగా క్రేజ్‌ పెరుగుతూ వస్తుంది. ప్రపంచంలో రెండు క్రీడలకు సరిసమానమైన క్రేజ్‌ ఉన్నా ఒక్క విషయంలో మాత్రం క్రికెట్‌కు అన్యాయమే జరుగుతుంది.

ప్రైజ్‌మనీ​ విషయంలో జెంటిల్మెన్‌ గేమ్‌ బాగా వెనుకపడి ఉంది. ప్రపంచకప్‌ విషయానికొస్తే.. ఫుట్‌బాల్‌ ప్రైజ్‌మనీతో పోలిస్తే క్రికెట్‌ ప్రైజ్‌మనీ చాలా తక్కువగా ఉంది. 2022 ఫిఫా ప్రపంచకప్‌ విన్నర్‌ (అర్జెంటీనా) ప్రైజ్‌మనీ భారత కరెన్సీలో సుమారు 334 కోట్ల రూపాయలు (42 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు) అయితే.. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ విజేతకు 33 కోట్ల రూపాయలు (4 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు) మాత్రమే దక్కుతుంది.

ప్రైజ్‌మనీ విషయంలో రెండు క్రీడల మధ్య ఇంత వ్యత్యాసం ఉండటంతో క్రికెట్‌ అభిమానులు బాగా ఫీలైపోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) అంత డబ్బు సంపాధిస్తున్నా క్రికెట్‌పై ఎందుకు ఇంత చిన్నచూపు అని వారు ప్రశ్నిస్తున్నారు. అనాదిగా క్రికెట్‌పై ఈ వివక్ష కొనసాగుతూనే ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధరణ విషయంలో ఫుట్‌బాలర్‌లతో పోలిస్తే క్రికెటర్లు ఏమాత్రం తీసిపోనప్పటికీ వారికందే పారితోషికం మాత్రం నామమాత్రంగా ఉందని అంటున్నారు. ఇకనైనా క్రికెటర్ల వ్యక్తిగత పారితోషికం, జట్టుకు అందే ప్రైజ్‌మనీ పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా, వన్డే ప్రపంచకప్‌ 2023 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీ మొత్తం 10 మిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా నిర్ణయించబడింది. ఇండియన్‌ కరెన్సీలో దీని విలువ దాదాపు 83 కోట్లు (82 కోట్ల 93 లక్షల 57 వేల 500 రూపాయలు). ఈ మొత్తం ప్రైజ్‌మనీ విజేత, రన్నరప్‌, సెమీ ఫైనలిస్ట్‌లు, గ్రూప్‌ స్టేజ్‌లో నిష్క్రమించిన జట్ల మధ్య విభజించబడుతుంది.   

విజేతకు 40 లక్షల యూఎస్‌ డాలర్లు (33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) దక్కుతుంది. రన్నరప్‌కు 20 లక్షల యూఎస్‌ డాలర్లు (16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) అందుతుంది. సెమీ ఫైనలిస్ట్‌లకు 8 లక్షల యూఎస్‌ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు).. గ్రూప్‌ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు లక్ష యూఎస్‌ డాలరు​ (82 లక్షల 92 వేల 950 రూపాయలు).. గ్రూప్‌ స్టేజీలో మ్యాచ్‌ గెలిచిన జట్టుకు 40 వేల యూఎస్‌ డాలర్లు (33 లక్షల 17 వేల 668 రూపాయలు) ప్రైజ్‌మనీగా అం​దుతుంది.

ఇదిలా ఉంటే, ఐసీసీ వన్డే ప్రపం​చకప్‌-2023 భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌-గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్‌ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్‌ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top