
వందో సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ స్టార్
జెనీవా ఓపెన్ కైవసం
జెనీవా: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వందో సింగిల్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. జెనీవా ఓపెన్‌లో చాంపియన్‌గా నిలవడం ద్వారా జొకో ఈ ఘనత సాధించాడు. తద్వారా ఓపెన్ ఎరాలో 100 సింగిల్స్ టైటిల్స్ సాధించిన మూడో ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డుల్లోకి ఎక్కాడు. జిమ్మి కానర్స్ (109; అమెరికా), రోజర్ ఫెదరర్ (103; స్విట్జర్లాండ్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 5–7, 7–6 (7/2), 7–6 (7/2)తో హబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు.
తొలి సెట్‌లో పరాజయం పాలైన జొకో... హోరాహోరీగా సాగిన మిగిలిన రెండు సెట్‌లను టై బ్రేకర్ ద్వారా గెలుచుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హుర్కాజ్ 19 ఏస్‌లు సంధించగా... జొకోవిచ్ 6 ఏస్‌లకే పరిమితమైనా కీలక సమయాల్లో పాయింట్లు కొల్లగొట్టాడు. హుర్కాజ్ 112 పాయింట్లు నెగ్గగా... జొకో 121 పాయింట్లు సాధించాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 99వ టైటిల్ ఖాతాలో వేసుకున్న జొకోవిచ్... ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందు ‘సెంచరీ’ పూర్తి చేసుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అనంతరం జొకో... షాంఘై మాస్టర్స్, మియామి మాస్టర్స్ టోర్నమెంట్ ఫైనల్స్‌కు చేరినా టైటిల్ గెలవలేకపోయాడు. ‘వందో టైటిల్ నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణం కోసం ఎతో కష్టపడ్డా. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. హబర్ట్ సర్వీస్‌ను బ్రేక్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అయినా ప్రయత్నించి సఫలమయ్యా’ అని జొకో అన్నాడు. 2006లో తొలి టైటిల్ నెగ్గిన జొకోవిచ్... 19 ఏళ్ల కెరీర్‌లో మూడంకెల సంఖ్యకు చేరుకున్నాడు.
ఈ క్రమంలో ఓపెన్ ఎరాలో 20 వేర్వేరు సీజన్లలో టైటిల్స్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్న జొకోవిచ్... నేటి నుంచి ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి విజేతగా నిలిచేందుకు కసరత్తు చేస్తున్నాడు. మట్టి కోర్టులో జరగనున్న ఈ టోర్నీ తొలి రౌండ్‌లో సోమవారం మెకెంజీ మెక్‌డొనాల్డ్ (అమెరికా)తో జొకోవిచ్ తలపడనున్నాడు.