
టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చిక్కుల్లో చిక్కుకున్నాడు. గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్దంతరంగా (మూడో టెస్ట్ తర్వాత) వైదొలిగిన నితీశ్.. ప్రస్తుతం చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నితీశ్‌పై అతని మాజీ ఏజెన్సీ 'స్క్వేర్ ది వన్' రూ. 5 కోట్ల బకాయిలు చెల్లించాలని పిటిషన్ దాఖలు చేసింది.
స్క్వేర్ ది వన్ సంస్థ 2021 నుంచి నితీశ్‌కు సంబంధించిన వాణిజ్య (ప్రకటనలు, ఎండార్స్‌మెంట్‌లు) కార్యకలాపాలు చూస్తుంది. అయితే నితీశ్ 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా స్క్వేర్ ది వన్ సంస్థతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకొని కొత్త ఏజెంట్‌ను పెట్టుకున్నాడు.
తమతో అకస్మాత్తుగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడన్న కోపంతో స్క్వేర్ ది వన్ సంస్థ నితీశ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా నితీశ్ తమకు చెల్లించవలిసిన బకాయిలు ఎగ్గొట్టాడని ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ చట్టంలోని సెక్షన్ 11(6) కింద పిటిషన్ దాఖలు చేసింది.
బకాయిల విషయమై తాము నితీశ్‌ను సంప్రదించగా.. ఎండార్స్‌మెంట్ డీల్స్ అన్నీ తానే స్వయంగా కుదుర్చుకున్నట్లు తెలిపాడని, బకాయిలు చెల్లించేందుకు నిరాకరించాడని స్క్వేర్ ది వన్ సంస్థ ఆరోపిస్తుంది. ఈ కేసు ఈ నెల 28న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.
ఎస్‌ఆర్‌హెచ్‌తో తెగదెంపులు.. క్లారిటీ ఇచ్చిన నితీశ్‌కుమార్ రెడ్డి
లీగల్ పరమైన సమస్యలు ఎదుర్కొంటుండగానే నితీశ్ తనపై జరుగుతున్న మరో ప్రచారంపై క్లారిటీ ఇచ్చాడు. తాను ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నితీశ్ కొట్టి పారేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో తన బంధం గౌరవం, ప్యాషన్‌తో ఏర్పడిందని.. తానెప్పుడూ ఎస్‌ఆర్‌హెచ్‌తోనే ఉండాలని కోరుకుంటానని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
కాగా, గత ఐపీఎల్ సీజన్‌లో తనను నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు పంపలేదని నితీశ్ ఎస్‌ఆర్‌హెచ్‌పై ఆగ్రహంగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై నితీశ్ తాజాగా వివరణ ఇచ్చాడు. నితీశ్ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే ఆగస్ట్ 8 నుంచి ప్రారంభమయ్యే ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ లీగ్‌లో నితీశ్ భీమవరం బుల్స్‌కు నాయకత్వం వహించాల్సి ఉంది.