
సింగపూర్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ మ్యాచ్‌ను వరుసగా ఇంగ్లండ్ గడ్డపైనే నిర్వహించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం మరోసారి దానికే ఓటు వేసింది. వచ్చే మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. 2027, 2029, 2031లకు సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకే ఆతిథ్య హక్కులు కట్టబెడుతున్నట్లు స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు జరిగిన మూడు ఫైనల్స్ (2021–సౌతాంప్టన్, 2023–ఓవల్, 2025–లార్డ్స్) సమర్థ నిర్వహణే అందుకు కారణమని వెల్లడించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే జూన్ నెలలో ఇతర క్రికెట్ దేశాలతో పోలిస్తే ఒక్క ఇంగ్లండ్‌లోనే ఆటకు అంతరాయం కలిగించని, సరైన వాతావరణం ఉండటం ప్రధాన కారణం.
పైగా తుది పోరులో ఎవరు తలపడినా... టెస్టు క్రికెట్ అభిమానులైన అక్కడి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై మ్యాచ్‌లకు ఆదరించడం కూడా ఐసీసీ నిర్ణయానికి కారణమైంది. ఐసీసీ సమావేశంలో రెండు కొత్త జట్లకు అసోసియేట్ సభ్యులుగా అవకాశం కల్పించారు. తిమోర్ లెస్టె, జాంబియా క్రికెట్ జట్లు ఇప్పుడు ఐసీసీలో భాగమయ్యాయి. దాంతో ఐసీసీ మొత్తం సభ్య దేశాల సంఖ్య 110కి చేరింది.