
క్రికెట్ పసికూన యూఏఈ రికార్డు విజయం సాధించింది. తమ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్‌పై విజయం నమోదు చేసింది (టీ20ల్లో). మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (మే 19) జరిగిన రెండో టీ20లో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన యూఏఈ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో యూఏఈ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్ కోసం యూఏఈలో (షార్జా) పర్యటిస్తున్న బంగ్లాదేశ్.. తొలి మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 మే 21న (షార్జాలో) జరుగనుంది.
రాణించిన బంగ్లా బ్యాటర్లు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. టాపార్డర్ బ్యాటర్లు తంజిద్ హసన్ (59), లిటన్ దాస్ (40), నజ్ముల్ హసన్ షాంటో (27), తౌహిద్ హృదోయ్ (45), జాకిర్ అలీ (6 బంతుల్లో 18) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. యూఏఈ బౌలర్లలో జవాదుల్లా 3, సాఘిర్ ఖాన్ 2 వికెట్లు తీశారు.
యూఏఈని గెలిపించిన కెప్టెన్
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈని కెప్టెన్ ముహమ్మద్ వసీం (42 బంతుల్లో 82) అద్భుత ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. వసీం ఔటయ్యే సరికి యూఏఈ లక్ష్యానికి ఇంకా దూరంలో ఉన్నా.. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు తలో సిక్సరో, బౌండరీనో బాది జట్టు గెలుపుకు దోహదపడ్డారు.
ఆఖర్లో ధృవ్ పరాషార్ (11), హైదర్ అలీ (15 నాటౌట్) జాగ్రత్తగా ఆడి యూఏఈకి రికార్డు విజయాన్నందించారు. యూఏఈ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్, నహిద్ రాణా, రిషద్ హొసేన్ తలో రెండు వికెట్లు తీయగా.. తన్వీర్ ఇస్లాం, తంజిమ్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.