రెచ్చిపోయిన రసెల్‌, రూథర్‌ఫోర్డ్‌.. కెనడా టీ20 లీగ్‌ విజేత మాంట్రియాల్‌ టైగర్స్‌

Montreal Tigers Won Global Canada T20 League By Defeating Surrey Jaguars In Final - Sakshi

కెనడా టీ20 లీగ్‌ 2023 ఎడిషన్‌ (మూడో ఎడిషన్‌.. 2018, 2019, 2023)  విజేతగా మాంట్రియాల్‌ టైగర్స్‌ నిలిచింది. సర్రే జాగ్వార్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 6) జరిగిన ఫైనల్లో మాంట్రియాల్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ లో స్కోరింగ్‌ గేమ్‌లో షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (29 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కడ దాకా నిలిచి మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ (6 బంతుల్లో 20 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించి మాంట్రియాల్‌ను గెలిపించాడు.   

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్రే జాగ్వార్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ జతిందర్‌ సింగ్‌ (57 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్‌ మహ్మద్‌ హరీస్‌ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్‌), అయాన్‌ ఖాన్‌ (15 బంతుల్లో 26; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంట్రియాల్‌ బౌలర్లలో అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, అబ్బాస్‌ అఫ్రిది, ఆండ్రీ రసెల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం అతి సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్‌ సున్నా పరుగులకే వికెట్‌ కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. అయితే కెప్టెన్‌ క్రిస్‌ లిన్‌ (35 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌).. స్రిమంత (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (15 బంతుల్లో 14; 2 ఫోర్లు) సాయంతో స్కోర్‌ బోర్డును నెమ్మదిగా కదిలించాడు. 60 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో మాంట్రియాల్‌ 2 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది.

ఈ దశలో వచ్చిన షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌.. దీపేంద్ర సింగ్‌ (16 రిటైర్డ్‌), ఆండ్రీ రసెల్‌ల సాయంతో మాంట్రియాల్‌ను విజయతీరాలకు చేర్చాడు. జాగ్వార్స్‌ బౌలర్లలో కెప్టెన్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ (4-0-8-2) అద్భుతంగా బౌల్‌ చేయగా.. స్పెన్సర్‌ జాన్సన్‌, అయాన్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ ఆధ్యాంతం రాణించిన రూథర్‌ఫోర్డ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top