'అత‌డు మ‌రో జహీర్ ఖాన్‌.. వెంట‌నే టీమిండియాకు ఎంపిక చేయండి' | Mohsin Khan and the makings of a future India pacer | Sakshi
Sakshi News home page

'అత‌డు మ‌రో జహీర్ ఖాన్‌.. వెంట‌నే టీమిండియాకు ఎంపిక చేయండి'

Apr 27 2026 4:12 PM | Updated on Apr 27 2026 4:43 PM

Mohsin Khan and the makings of a future India pacer

భార‌త క్రికెట్‌లో ప్ర‌స్తుతం లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ల కొర‌త ఎక్కువ‌గా ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత ఇప్ప‌టివ‌ర‌కు  సరైన బౌలర్లు దొరకలేదు. అర్ష్‌దీప్ సింగ్ ఉన్న‌ప్ప‌టికి కేవ‌లం టీ20ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నాడు. దీంతో భార‌త వ‌న్డే, టెస్టు జ‌ట్టులో ఎడ‌మ చేతి వాటం పేస‌ర్ లేని లోటు స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది.

అయితే ఇప్పుడు మొహ్సిన్ ఖాన్ రూపంలో మరో లెప్ట్ ఆర్మ్ పేసర్ వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మొహ్సిన్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆదివారం  ఏకానా స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మొహ్సిన్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 

త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం కేవ‌లం 23 ప‌రుగులిచ్చి 5 వికెట్లను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో తొలి ఐదు వికెట్ల హాల్ సాధించిన బౌల‌ర్‌గా అత‌డు నిలిచాడు. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా మూడు మెయిడెన్ ఓవర్లు వేశాడు. అందులో రెండు వికెట్ మెయిడెన్ ఓవ‌ర్లు ఉన్నాయి. 

మొహ్సిన్‌కు అద్భుత‌మైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. వైవిధ్యంగా బంతులు వేయడం అతడి స్పెషాలిటీ. అదే స‌మ‌యంలో స‌రైన పేస్ కూడా జ‌న‌రేట్ చేయ‌గ‌ల‌డు. సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో కూడా అతడు బౌలింగ్‌ చేస్తున్నాడు. కాగా అత‌డు దేశ‌వాళీ క్రికెట్‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. 2018లో విజయ్ హజారే ట్రోఫీతో లిస్ట్-ఏ క్రికెట్‌లోకి, అదే ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో టీ20ల్లోకి అడుగుపెట్టాడు. 

అనంతరం 2020లో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌-2018లో అత‌డిని ముంబై ఇండియ‌న్స్ తొలిసారిగా కొనుగోలు చేసింది. కానీ ఆ సీజ‌న్‌లో అత‌డికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవ‌కాశం ల‌భించ‌లేదు. కానీ జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలతో ట్రావెల్ చేశాడు. ఆ త‌ర్వాత ఐపీఎల్‌-2022 వేలంలో మొహ్సిన్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

ఆ సీజ‌న్‌లో అత‌డు  9 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అత‌డు ఇప్పటివ‌ర‌కు 28 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఓవ‌రాల్‌గా అత‌డి పేరిట 89 టీ20 వికెట్లు ఉన్నాయి. సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతున్న మొహ్సిన్‌ను భార‌త జ‌ట్టుకు ఎంపిక చేయాల‌ని మాజీ క్రికెట‌ర్లు సూచిస్తున్నారు. మ‌రికొంత‌మంది ఒక‌డుగు ముందుకేసి భార‌త బౌలింగ్ దిగ్గ‌జం జ‌హీర్ ఖాన్‌తో పోలుస్తున్నారు.
చదవండి: IPL 2026: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం..! సీజన్‌ మధ్యలోనే?


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement