సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న క్రీడాకారులకు తమ వంతుగా చేయూత ఇస్తున్నామని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటీ) విద్యా సంస్థ తెలిపింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌తో సహా ఇప్పటి వరకు 146 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ కోర్సులలో పూర్తిగా ఉచిత విద్య అందించినట్టు ఎంఎల్‌ఆర్‌ఐటీ కార్యదర్శి మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
‘యువ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడానికి, వారికి ఉన్నత విద్యలో అవకాశాలు అందించడానికి 2017–18లో ఈ ఉచిత ప్రవేశాలు ప్రారంభించాం. చదువు, క్రీడల మధ్య సరైన సమతుల్యత పాటిస్తూ, అర్హులైన విద్యార్థులు రెండు రంగాల్లోనూ రాణించేలా చూడటమే మా లక్ష్యం’ అని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో నిఖత్‌కు ఐదు లక్షల రూపాయల స్కాలర్‌షిప్ అందించామని, భవిష్యత్‌లోనూ మరింత మంది క్రీడాకారులకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.


