PC: X
సొంతగడ్డపై టీమిండియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ ఓటమితో ఆరంభించింది. గురువారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 4 వికెట్ల తేడాతో కివీస్ పరాజయం పాలైంది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, బౌలర్లు దానిని కాపాడుకోలేకపోయారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనతో పాటు తన గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు.
"ఫీల్డింగ్ చేసేటప్పుడు మెడకు కాస్త దెబ్బ తగిలింది. కానీ ఇప్పుడైతే ఫర్వాలేదు, అంతా బాగానే ఉంది. ఓడిపోయినప్పటికీ మా కుర్రాళ్లు చివరి వరకు పోరాడారు. ముఖ్యంగా మా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఇన్నింగ్స్ ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. మా ఓపెనర్లు కండిషన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్ సూపర్ నాక్ ఆడాడు. అతడు దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతం.
ప్రత్యర్థి జట్టులో వరల్డ్‌క్లాస్ ఓపెనర్లు ఉన్నారు. వారి సత్తా ఏంటో మాకు తెలుసు. మరోసారి వారు అసాధారణ ప్రదర్శన కనబరిచారు. దూకుడుగా ఆడుతూ మా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. బౌలింగ్‌లో మేము మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. అయితే మిడిల్ ఓవర్లలో మేము పుంజుకుని కమ్‌బ్యాక్ ఇచ్చాం.
అందుకే మ్యాచ్ చివరి వరకు వెళ్ళగలిగింది. ఇంకా కొన్ని అంశాల్లో మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా కొన్ని క్యాచ్‌లను జారవిడిచాం. ఆ క్యాచ్‌లు అందుకుని ఉండింటే ఫలితం మరోవిధంగా ఉండేదేమో! అయితే ఫ్లడ్ లైట్ల వెలుగులో క్యాచ్‌లు అందుకోవడం అంత సులభం కాదు. మా తదుపరి మ్యాచ్‌లలో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటామని" పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో శాంట్నర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే?


