అతడొక సంచలనం.. ఎంత పొగిడినా తక్కువే: శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyer Praises Team After Indias Highest-Ever T20 Run Chase in New Zealand | Sakshi
Sakshi News home page

అతడొక సంచలనం.. ఎంత పొగిడినా తక్కువే: శ్రేయస్‌ అయ్యర్‌

Oct 22 2026 8:26 PM | Updated on Oct 22 2026 8:38 PM

Shreyas Iyer Praises Team After Indias Highest-Ever T20 Run Chase in New Zealand

క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించింది. 226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు చెలరేగి ఆతిథ్య జట్టుకు షాకిచ్చారు. మాట్ హెన్రీ, ఫెర్గూసన్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లు ఉన్నప్పటికీ.. మన బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. 

ముఖ్యంగా సంజూ శాంసన్ (67), శ్రేయస్ అయ్యర్ (42), నమన్ ధీర్ (42 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. సిరీస్‌ను విజయంతో ఆరంభించడం చాలా సంతోషంగా ఉందన్నాడు.

"నిజంగా ఇదొక అద్భుతం. ఈ సంతోషంలో సుదూర ప్రయాణం వల్ల కలిగిన అలసటను పూర్తిగా మర్చిపోయాం. మేము బౌలింగ్ ప్రారంభించినప్పుడు పిచ్ కొద్దిగా నెమ్మదిగా ఉంది, బంతి ఆగుతూ వచ్చింది. కానీ, బౌలింగ్‌లో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము.

సరైన లెంగ్త్‌లో కాకుండా హిట్టింగ్ జోన్‌లో బంతులు వేశాము. తొలి ఇన్నింగ్స్‌లోనే మంచు ప్రభావం ప్రారంభమైంది. పిచ్ మరింత ఫ్లాట్‌గా మారిపోవడంతో బంతి బ్యాట్‌పైకి చక్కగా వచ్చింది. కివీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడి 225 పరుగుల భారీ స్కోర్ సాధించారు. ఈ విషయంలో వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే.

220కి పైగా లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు కచ్చితంగా మంచి ఆరంభం లభించాలి. మా ఓపెనర్లు అభిషేక్, సంజూ మరోసారి మాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మొదటి ఆరు ఓవర్లలోనే 90-95 పరుగులు సాధించడం నిజంగా గ్రేట్‌" అని అయ్యర్ కొనియాడాడు.

మా ఓపెనర్లు అద్భుతం..
వారిద్దరికీ ఈ ఫార్మాట్‌లో అపారమైన అనుభవం ఉంది. ఇలాంటి పరిస్థితులను వారు చాలాసార్లు ఎదుర్కొన్నారు. కాబట్టి, వారికి ఎలా ఆడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి ఏమి చేయాలో బాగా తెలుసు. ఒక్కసారి రిథమ్ అందుకుంటే వారిని ఆపడం ఎవరి తరం కాదు. అది మరోసారి ఈ మ్యాచ్‌లో రుజువైంది. 

కొన్నిసార్లు వారు విఫలమవ్వొచ్చు, కానీ చాలా సందర్భాల్లో మాకు ఘన ఆరంభాన్ని అందిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మేము క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లి, మ్యాచ్‌ను విజయవంతంగా ముగిస్తాము అని అయ్యర్ పేర్కొన్నాడు.  ఈ మ్యాచ్‌లో కీల‌క నాక్ ఆడిన న‌మ‌న్ ధీర్‌పై శ్రేయ‌స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

"న్యూజిలాండ్‌లో కొందరికి నమన్ ధీర్‌ను మైదానంలో చూడటం ఇదే మొదటిసారి కావచ్చు. కానీ, అతడొక సంచలనం. నమన్ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అతడు బ్యాట్‌తో పాటు బంతితో కూడా అద్భుతాలు చేయగలడు. కచ్చితంగా అలాంటి ఆటగాడు ప్రతీ జట్టుకూ అవసరం. అతడు వేసే రెండు, మూడు కీలమ ఓవర్లు మ్యాచ్ స్వభావాన్నే మార్చగలవు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అయ్యర్ చెప్పుకొచ్చాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement