
Photo Courtesy: MI X
రాజస్తాన్ రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. తమ యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ (Vignesh Puthur) ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మొత్తం మ్యాచ్‌లకు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో రఘు శర్మ (Raghu Sharma)ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.
చెన్నైతో మ్యాచ్‌లో అరంగేట్రం
కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కాగా.. ఆ మరుసటి రోజు ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా కేరళకు చెందిన విఘ్నేశ్ పుతూర్ ముంబై తరఫున అరంగేట్రం చేశాడు.
రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివం దూబే, దీపక్ హుడా వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా 24 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన విఘ్నేశ్ పుతూర్ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టాడు.
గాయం కారణంగా దూరం
అయితే, ఇటీవల విఘ్నేశ్ గాయపడ్డాడు. అతడి రెండు కాళ్ల ఎముకల్లోనూ నొప్పి రావడంతో ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రఘు శర్మను తీసుకుంది.
ఇక మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ విఘ్నేశ్ పుతూర్ మాత్రం జట్టుతో కలిసి ప్రయాణం చేయనున్నాడు. ముంబై ఇండియన్స్ వైద్య బృందం పర్యవేక్షణలో అతడు చికిత్స తీసుకుంటాడని ఫ్రాంఛైజీ తమ ప్రకటనలో వెల్లడించింది.

రఘు శర్మ ధర రూ. 30 లక్షలు
కాగా ముంబై నెట్ బౌలర్లలో ఒకడైన రఘు శర్మ కనీస ధర రూ. 30 లక్షలతో విఘ్నేశ్ పుతూర్ స్థానాన్ని భర్తీ చేశాడు. 32 ఏళ్ల రఘు దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్, పుదుచ్చేరి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటికి 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 57 వికెట్లు తీసిన రఘు శర్మ.. లిస్ట్-ఎ క్రికెట్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో 14 వికెట్లు.. మూడు టీ20లలో మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌ను పరాజయాలతో ఆరంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. వరుసగా గత ఐదు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటిన హార్దిక్ సేన.. ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మొత్తం ఆరు విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.