FIFA WC: తండ్రి మారడోనాతో.. కొడుకు మెస్సీతో

Messi Gives MoM-Award Youngster Mac Allister Whose-Father-Maradona-Team - Sakshi

అద్భుతాలు అరుదుగా జరుగుతాయంటారు. తాజాగా ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఇలాంటిదే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా, పోలాండ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 తేడాతో పోలాండ్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మ్యాచ్‌లో ఓటమి పాలైన రాబర్ట్‌ లెండోవాస్కీ నేతృత్వంలోని పోలాండ్‌ కూడా రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించింది.

ఈ విషయం పక్కనబెడితే.. అర్జెంటీనా మ్యాచ్‌లో చేసిన రెండు గోల్స్‌లో ఒకటి జట్టు మిడ్‌ఫీల్డర్‌ అలెక్సిస్‌ మెక్‌ అలిస్టర్‌ చేశాడు. ఆట 46వ నిమిషంలో అర్జెంటీనాకు గోల్‌ అందించాడు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ తనకు వచ్చిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అలిస్టర్‌కు ఇచ్చేశాడు. దీని వెనుక ఒక కారణం ఉంది.

అలెక్సిస్‌ మాక్‌ అలిస్టర్‌ తండ్రి కార్లోస్‌ మాక్‌ అలిస్టర్‌ కూడా ఫుట్‌బాలర్‌గా జట్టుకు సేవలందించాడు. కార్లోస్‌ దిగ్గజం మారడోనాతో కలిసి అర్జెంటీనాతో పాటు బోకా జూనియర్స్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. మారడోనాతో కలిసి తండ్రి కార్లోస్‌ అలిస్టర్‌ ఆడితే.. ఇప్పటితరం గొప్ప ఆటగాళ్లలో ఒకడైన లియోనల్‌ మెస్సీతో కలిసి కొడుకు అలెక్సిస్‌ మాక్‌ అలిస్టర్‌ వేదికను పంచుకున్నాడు. అందుకే మెస్సీ అలెక్సిస్‌ తండ్రిపై ఉన్న గౌరవంతో అతనికి వచ్చిన అవార్డును అలెక్సిస్‌కు అందించాడు.

ఇదే విషయమై అలెక్సిస్‌ మాక్‌ అలిస్టర్‌ స్పందింస్తూ.. ఇది ఎప్పటికి మరిచిపోలేనిది. నా తండ్రి దిగ్గజం మారడోనాతో కలిసి ఆడడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు నా ఆరాధ్య దైవం మెస్సీతో కలిసి ఆడడం మరిచిపోలేని అనుభూతి. అతను నాకు ట్రైనింగ్‌ ఇస్తున్న తీరుకు ఫిదా అయ్యా. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్న అర్జెంటీనా డిసెంబర్‌ 4న ఆస్ట్రేలియాతో ఆడనుంది. అటు పోలాండ్‌ డిపెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌తో అమితుమీ తేల్చుకోనుంది.

చదవండి: Lionel Messi: 'పైనున్న మారడోనా సంతోషపడి ఉంటాడు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top